- సుప్రీంకోర్టు రూల్స్ పాటించాల్సిందే..
Raghurama Krishnam Raju letter to DGP | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా ఏర్పడుతున్న శబ్ద కాలుష్యంపై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తీవ్ర స్థాయిలో స్పందించారు.
నిబంధనలకు విరుద్ధంగా, అనధికారికంగా వాడుతున్న స్పీకర్ల వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను వివరిస్తూ రాష్ట్ర డీజీపీకి ఆయన ఒక లేఖ రాశారు.
రాష్ట్రంలో శబ్ద కాలుష్య నియంత్రణ చట్టం మరియు భారతీయ న్యాయ సంహిత (BNS) నిబంధనలను కఠినంగా అమలు చేయాలని రఘురామ కోరారు.
అకాల సమయంలో వచ్చే లౌడ్ స్పీకర్ల శబ్దం వల్ల పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, వృద్ధులు మరియు ఆసుపత్రుల్లోని రోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు..
లౌడ్ స్పీకర్ల వినియోగంపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఏడాదిలో గరిష్టంగా కేవలం 15 రోజులు మాత్రమే లౌడ్ స్పీకర్లకు అనుమతి ఉంటుందని, మిగిలిన సమయాల్లో నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.
పబ్లిక్ న్యూసెన్స్ కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, అనధికారికంగా ఉన్న లౌడ్ స్పీకర్లను స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉందని ఆయన తన లేఖలో డీజీపీకి సూచించారు.











