Bandi Sanjay Comments | సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు, తప్పుడు ఆరోపణలతో బెదిరించాలని చూస్తున్నారని, తాను దేనికీ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
“భయపడటానికి నేనేమీ ఫామ్‌హౌస్‌లో దాక్కునే ఎలుకను కాదు” అని వ్యాఖ్యానించారు. ‘జై శ్రీరామ్’ అనే నినాదం వింటేనే కాంగ్రెస్ నేతలు వణికిపోతున్నారని బండి సంజయ్ విమర్శించారు.
“జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా?” అని హేళన చేస్తున్న వారికి బెంగాల్ ఫలితాలే సమాధానమని, అదే నినాదంతో అక్కడ బీజేపీ జెండా ఎగురవేసిందని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణలోనూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. రైతులను ప్రభుత్వం గాలికొదిలేసిందని, ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు.
సనాతన ధర్మాన్ని కించపరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, ధర్మ రక్షణ కోసం నిరంతరం పనిచేస్తామని స్పష్టం చేశారు.
పార్టీలోని నాయకులు తమ మధ్య ఉన్న చిన్నచిన్న అభిప్రాయభేదాలను పక్కన పెట్టి, పార్టీ బలోపేతం కోసం కష్టపడాలని పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తగా ఉన్నందుకు తాను గర్విస్తున్నానని, పార్టీ తలవంచుకునే పని ఎప్పుడూ చేయనని ఆయన చెప్పుకొచ్చారు.











