– వడ్డీ లేని రుణం రూ.10 లక్షలకు పెంపు
Interest Free Loans For Women | తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు (SHG) రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు.
ఈ మేరకు రూ.10 లక్షల వరకు మహిళా సంఘాలు తీసుకునే రుణాలకు సంబంధించిన వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు.
ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహిళా స్వయం సహాయక బృందాల ‘బ్యాంకు వార్షిక రుణ ప్రణాళిక’ను మంత్రి ఆవిష్కరించారు.
ఈ ఏడాది మహిళా సంఘాలకు రూ.25,228.89 కోట్ల బ్యాంకు రుణాలు అందించినట్లు ఆమె తెలిపారు.
కోటి మంది కోటీశ్వరులే లక్ష్యం..
‘మహిళా ఉన్నతి-తెలంగాణ ప్రగతి’ అనే నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి పేర్కొన్నారు.
మహిళలు పేదరికం నుంచి బయటపడినప్పుడే రాష్ట్ర అభివృద్ధి పరిపూర్ణమవుతుందని ఆమె వ్యాఖ్యానించారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.










