PM Modi plays football in Sikkim | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) మంగళవారం ఉదయం సిక్కింలో సందడి చేశారు. సిక్కిం రాష్ట్ర అవతరణ స్వర్ణోత్సవ ముగింపు వేడుకలకు హాజరైన ఆయన, స్థానిక యువ క్రీడాకారులతో కలిసి ఫుట్‌బాల్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఈ ఎనర్జిటిక్ సెషన్‌కు సంబంధించిన ఫోటోలను ఆయన స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. “గాంగ్టక్ ఉదయం వేళ నా యువ మిత్రులతో కలిసి ఫుట్‌బాల్ ఆడటం ఎంతో ఉత్సాహాన్నిచ్చింది” అని ప్రధాని ఎక్స్ (X) వేదికగా పేర్కొన్నారు.
సిక్కింలో ఫుట్‌బాల్, ఆర్చరీ (విలువిద్య) నైపుణ్యాలను వెలికితీసేందుకు క్రీడా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాలను భారతదేశ ‘అష్టలక్ష్మి’లుగా ప్రధాని అభివర్ణించారు.
‘యాక్ట్ ఈస్ట్’ పాలసీ మాత్రమే కాకుండా, ఈ ఎనిమిది రాష్ట్రాల అభివృద్ధి కోసం ‘యాక్ట్ ఫాస్ట్’ మంత్రాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. సిక్కిం 50 ఏళ్ల వేడుకల సందర్భంగా రూ. 4,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు.
పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా గాంగ్టక్ రింగ్ రోడ్డు, వెస్ట్ బెంగాల్ బాగ్డోగ్రా నుండి ఎక్స్ ప్రెస్‌వే మరియు రోప్ వే ప్రాజెక్టులను ప్రకటించారు. సిక్కిం ఆర్థిక వ్యవస్థకు పర్యాటకమే వెన్నెముక అని, అందుకే 1,000 హోమ్‌స్టేల నిర్మాణం మరియు సాహస యాత్రల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు.






