No stock petrol bunks in AP Telangana | తెలుగు రాష్ట్రాల్లో ఇంధన సంక్షోభం ముదురుతోంది. ప్రభుత్వం నుంచి “ఇంధన కొరత లేదు” అనే ప్రకటనలు వెలువడుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.
ఏపీలోని రాయలసీమ మరియు కోస్తాంధ్రతో పాటు, తెలంగాణలోని గ్రామీణ జిల్లాల్లో మెజారిటీ బంకులు ‘నో స్టాక్’ (No Stock) బోర్డులతో మూతపడి ఉండటం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
రైతులకు ‘డీజిల్’ దెబ్బ..
ప్రస్తుతం వరి కోతల సీజన్ కావడంతో డీజిల్ కొరత రైతులకు శాపంగా మారింది. హార్వెస్టర్లు, ట్రాక్టర్లు నడిపేందుకు డీజిల్ లభించక పొలాల్లోనే మిషన్లు నిలిచిపోయాయి. అకాల వర్షాల భయంతో కోతలు త్వరగా పూర్తి చేయాలని చూస్తున్న రైతులకు, బంకుల వద్ద గంటల తరబడి నిరీక్షణ మిగులుతోంది.
అసలేం జరుగుతోంది..
హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరా ఆగిపోతుందనే వదంతులు సోషల్ మీడియాలో రావడంతో, వాహనదారులు భారీగా ఇంధనాన్ని నిల్వ చేసేందుకు క్యూ కడుతున్నారు.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) డీలర్లకు ఇచ్చే ఓవర్ డ్రాఫ్ట్ (OD) సౌకర్యాన్ని కుదించడంతో, చిన్న బంకుల యజమానులు అడ్వాన్స్ డబ్బులు చెల్లించి స్టాక్ తెచ్చుకోలేకపోతున్నారు.
బ్లాక్ మార్కెట్ దందా..
కొన్ని బంకుల్లో సామాన్యులకు ఇంధనం లేదని చెప్పి, డ్రమ్ముల్లో నింపి అక్రమంగా లీటరుపై రూ. 20 నుండి రూ. 30 అదనంగా వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, నిత్యావసర సరుకుల చట్టం ప్రకారం బంకుల్లో తనిఖీలు చేపట్టాలని, బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేయాలని వాహనదారులు కోరుతున్నారు.






