Richest candidate in Tamil Nadu Elections | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల (Tamilnadu Assembly Elections) నామినేషన్ల పర్వంలో ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. AIADMK పార్టీ తరపున లాల్గుడి (Lalgudi) నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న లీమా రోజ్ మార్టిన్, ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యంత సంపన్న అభ్యర్థిగా రికార్డు సృష్టించారు.
తన భర్త, ప్రముఖ వ్యాపారవేత్త శాంటియాగో మార్టిన్ ఆస్తులతో కలిపి ఆమె సమర్పించిన అఫిడవిట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. లీమా రోజ్ తన కుటుంబానికి మొత్తం రూ. 5,863 కోట్ల సంపద ఉన్నట్లు ప్రకటించారు.
అందులో ఆమెకు సంబంధించిన ఆస్తులే వెయ్యి కోట్లకు పైగా ఉన్నాయి. ఆమె పేరిట రూ. 139 కోట్ల చరాస్తులు, రూ. 910 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. లాటరీ వ్యాపారంలో దిగ్గజమైన మార్టిన్ పేరిట రూ. 3,262 కోట్ల చరాస్తులు, రూ. 887 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. వీరి కుమారుడు జోస్ టైసన్ మార్టిన్ పేరిట కూడా రూ. 664 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి.
మరో ఆసక్తికర అంశం ఏంటంటే లీమా రోజ్ మార్టిన్ తన విద్యార్హతను కేవలం 6వ తరగతి (Class VI) గా పేర్కొన్నారు. ఇంతటి భారీ సంపద ఉన్నప్పటికీ, చట్టపరంగా ఆమెపై నాలుగు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు.
మార్టిన్ కుటుంబం నుంచి మొత్తం ముగ్గురు సభ్యులు వేర్వేరు పార్టీల తరపున ఎన్నికల బరిలో ఉండటం విశేషం. కుమారుడు పుదుచ్చేరిలో NDA తరపున, అల్లుడు TVK తరపున పోటీ చేస్తున్నారు.









