Excise constable Gajula Sowmya passes away | అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాతో వీరోచితంగా పోరాడిన మహిళా కానిస్టేబుల్ సౌమ్య నిన్స్ ఆసుపత్రిలో శనివారం తుదిశ్వాస విడిచారు. జనవరి 23న నిజామాబాద్ లో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. అయితే గంజాయి ముఠా సౌమ్యను వహనంతో ఢీ కొట్టి అత్యంత దారుణంగా దాడి చేసింది. వైద్యులు శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య శనివారం కన్నుమూశారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనర్ స్పందించారు. మత్తు రక్కసిని అడ్డుకునేందుకు..మృత్యువునే ఎదిరించిన మేలిమి ధైర్యం సౌమ్యది అని పేర్కొన్నారు. రక్తమోడుతున్నా విధిని వీడని..నిరుపమాన ‘త్యాగం’ ఆమె సొంతం అన్నారు. సమాజ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని ధైర్యానికి సెల్యూట్ తల్లీ అంటూ సౌమ్యకు నివాళులర్పించారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్తే.. కనికరం లేకుండా వాహనంతో తొక్కించి చంపేశారంటే, డ్రగ్ మాఫియా ఎంతలా పేట్రేగిపోతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. సౌమ్య ధైర్యానికి మరణం లేదన్నారు.










