Wednesday 15th July 2026
12:07:03 PM
Home > తాజా > గ్రామ పంచాయతీలకు సీఎం రేవంత్ శుభవార్త!

గ్రామ పంచాయతీలకు సీఎం రేవంత్ శుభవార్త!

cm revanth
  • సీఎం స్పెషల్ ఫండ్ నుంచి అదనపు నిధులు
  • మేజర్ పంచాయతీలకు రూ. 10 లక్షలు
  • చిన్న పంచాయతీలకు రూ. 5 లక్షలు

CM Revanth Good News To Villages | తెలంగాణలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలతో కొత్తగా కొలువుదీరిన స్థానిక ప్రభుత్వాలకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుభవార్త చెప్పారు.

రాష్ట్రంలోని మొత్తం 12,706 గ్రామాలకు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద అదనంగా నిధులు అందిస్తామని ప్రకటించారు. మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షల చొప్పున, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షల రూపాయల చొప్పున స్పెషల్ డెవలప్‌మెంట్‌ ఫండ్‌గా నిధులు ఇందజేస్తామని చెప్పారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులకు ఈ నిధులు అదనమని స్పష్టం చేశారు. నూతన సంవత్సరంలో ఈ ప్రత్యేక నిధులను అందజేస్తామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా గ్రామ సర్పంచులకు ప్రజల్లో గౌరవం, మర్యాద పెంచుతుందని చెప్పారు. గ్రామ సభలు పెట్టుకుని అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, గ్రామాల్లో ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడానికి దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.

కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల కోసం కోస్గీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీ ప్రతినిధులను ముఖ్యమంత్రి గారు సత్కరించి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. “ప్రభుత్వం సర్పంచులకు అండగా నిలుస్తుంది. మార్చి 31 లోపు గ్రామ పంచాయతీలకు రావలసిన ౩ వేల కోట్ల రూపాయలను తెప్పించే బాధ్యత తీసుకుంటా. గ్రామ సభలు పెట్టుకుని కార్యాచరణ రూపొందించుకుని అభివృద్ధి సాధించుకోవాలి. ఎన్నికలు ముగిసాయి.

పార్టీలు పంథాలు ఎన్నికల సమయంలోనే. ప్రతి పౌరుడు మన కుటుంబ సభ్యుడే. ఎవరి పట్ల వివక్ష చూపరాదు. చెబితే వినలేదనో, ఎన్నికల్లో పోటీ చేశారనో ప్రత్యర్థులు గెలిచారనో కారణంగా వివక్ష చూపించరాదు. చిన్న చిన్న అభిప్రాయబేధాలు ఉంటే పక్కన పెట్టాలి.

రాష్ట్రంలో పడావు పెట్టిన ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తున్నాం. అనుమతులు సాధిస్తున్నాం. గత ప్రభుత్వంలో చేసిన 8 లక్షల కోట్ల అప్పులున్నాయి. ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తున్నాం. బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు – రంగారెడ్డి, మక్తల్‌ – నారాయణపేట ప్రాజెక్టులేవీ గత పదేళ్లలో పూర్తి చేయలేదు. చుక్క నీరివ్వలేదు. వాటన్నింటినీ చేపడుతాం. చదువు ఒక్కటే నిరుపేదల జీవితాలను మార్చగలదు. అందుకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం అందించే కార్యక్రమం చేపట్టబోతున్నాం.

పేదలకు నాణ్యమైన విద్య, ఉన్నత ప్రమాణాలు కల్పించినప్పుడే మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రజలు ఆశీర్వదించి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్నాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో అర్హులైన వారందరికీ కొత్తగా రేషన్‌ కార్డులు ఇచ్చాం. ఇంకా ఎవరికైనా రాకపోతే సర్పంచులు ఇళ్లిళ్లు తిరిగి తేల్చితే ఇంకా రేషన్ కార్డులు రానివారికి ఇప్పించే బాధ్యత ప్రభుత్వానిది.

అర్హులైన ప్రతి పేద వాడికి సన్నబియ్యం అందాలి. రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. ఇంకా ఎవరికైనా రాకపోతే అందరికీ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా 200 యూనిట్లలోపు వాడుకున్న వారికి ఉచిత విద్యుత్ అందకపోతే ఆ కుటుంబాల పేర్లను కూడా రాసుకోండి. రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందించాం. ఇంకా ఎవరికైనా ఆ జాబితాలో పేర్లు రాకపోతే వారి పేర్లను కూడా నమోదు చేయండి. ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం.

ఎవరైనా ఎక్కడైనా ప్రయాణం చేసినప్పుడు డబ్బు అడిగితే చెప్పండి. తెలంగాణ ఆడబడ్డలు కోటిమందికి కోటి ఇందిరమ్మ చీరలను సారెగా అందించాలని నిర్ణయించాం. రాష్ట్రంలో 18  సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు చీర అందాలి. ఎవరికైనా అందకపోతే సర్పంచులు స్వయంగా వారి పేర్లను నమోదు చేయాలి.

ప్రతి ఇంటికీ చీర చేయాల్సిందే. ప్రతి తండాకు, గ్రామానికి రోడ్లు, బడి, గుడి, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే కాకుండా పిల్లల భవిష్యత్తు కోసం నాణ్యమైన చదువులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి కొడంగల్‌ను ఒక పెద్ద పారిశ్రామికవాడగా అభివృద్ధి చేసుకుంటున్నాం. కొడంగల్‌ను దేశానికి ఒక మాడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం.

జూనియర్‌, డిగ్రీ, అగ్రికల్చర్‌, మెడికల్‌ కాలేజీలతో పాటు సైనిక్ స్కూల్‌ ను ఏర్పాటు చేస్తున్నాం. మొత్తంగా 250 ఎకరాల్లో కొడంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దబోతున్నాం. కక్ష సాధింపు రాజకీయాలు చేయం. కష్టాన్ని నమ్ముకున్నాం. కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో 180 గ్రామ పంచాయతీల్లో ప్రజల తీర్పును గౌరవించి ఎన్నికైన గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లను ప్రత్యక్షంగా కలవాలని, అభినందించాలని, వారు తిరిగి గ్రామాలకు వెళ్లి ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకుని ప్రజా సేవ చేయాలని ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాం.

తెలంగాణ రాష్ట్రానికి కొడంగల్‌ను ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నిలబెట్టినందుకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. కొడంగల్ ప్రజలు నిండుమనసుతో ఆశీర్వదించి గుండెల్లో పెట్టుకుని భుజాలపై మోసినందునే ఈరోజు ముఖ్యమంత్రిని కాగలిగాను.” అని అన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి వాకిటి శ్రీహరి గారితో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు, కొత్తగా ఎన్నికైన నియోజకవర్గంలోని గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డుమెంబర్లతో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

You may also like
“కొడంగల్‌లో 11 వేల కర్ణాటక ఓట్లు”.. కవిత సంచలన ఆరోపణలు!
TG Heat Wave Alert
తెలంగాణ ప్రజలకు అలర్ట్.. తప్పనిసరి అయితేనే బయటకు రండి!
azharuddin and kodandaram as mlc
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాంప్రమాణ స్వీకారం.. మంత్రి పదవికి వీడిన గండం!
dr preeti reddy gives clarity on joingin bjp
బీజేపీలోకి మల్లారెడ్డి కోడలు.. క్లారిటీ ఇచ్చిన ప్రీతి రెడ్డి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions