Friday 26th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > భారత పౌరసత్వం కోసం 94 ఏళ్ల వృద్ధురాలి ఆరాటం!

భారత పౌరసత్వం కోసం 94 ఏళ్ల వృద్ధురాలి ఆరాటం!

94 Year Old NRI Woman Seeks Indian Citizenship | నేటి యువత అమెరికా వీసా కోసమో, గ్రీన్‌కార్డ్ కోసమో కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న రోజులివి. కానీ, బాపట్ల జిల్లాకు చెందిన 94 ఏళ్ల వృద్ధురాలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఆలోచించారు.

దశాబ్దాల పాటు అనుభవించిన అమెరికా పౌరసత్వాన్ని సైతం తృణప్రాయంగా వదులుకుని.. “తాను చనిపోయాక కట్టె ఈ మాతృభూమిలోనే కాలాలి, ఈ మట్టిలోనే కలిసిపోవాలి” అనే చివరి కోరికతో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు.

అమెరికా టు బాపట్ల.. ‘మహాలక్ష్మమ్మ’ ప్రయాణం..

బాపట్ల జిల్లా చినగంజాం మండలం చింతగుంపల గ్రామానికి చెందిన కొండ్రుగుంట మహాలక్ష్మమ్మ, నాగభూషణం దంపతుల కుమారుడు బుచ్చయ్య చౌదరి అమెరికాలోని పీటర్స్‌బర్గ్‌ లో డాక్టర్‌గా స్థిరపడ్డారు. భర్త మరణం తర్వాత మహాలక్ష్మమ్మ కూడా అమెరికా వెళ్లారు.

అక్కడ నివసిస్తున్న క్రమంలో 2000 సంవత్సరంలో ఆమెకు అమెరికా పౌరసత్వం (US Citizenship) లభించింది. అయితే, మాతృభూమిపై మమకారంతో 2018లో మహాలక్ష్మమ్మ, ఆమె కుమారుడి కుటుంబం అంతా కలిసి భారతదేశానికి తిరిగి వచ్చేశారు.

కుమారుడు బుచ్చయ్య చౌదరి ఇక్కడ ఎన్‌ఆర్‌ఐ కాలేజీలో డైరెక్టర్‌గా చేరగా, మహాలక్ష్మమ్మ గత ఎనిమిదేళ్లుగా తన సొంతూరు చింతగుంపలలోనే నివాసం ఉంటున్నారు.

చట్టబద్ధంగా భారతీయ పౌరురాలిగానే కన్నుమూయాలనే సంకల్పంతో అమెరికా పౌరసత్వం వదులుకొని, ఆన్‌లైన్ ద్వారా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు.

కలెక్టరేట్‌లో రాజ్యాంగ ప్రమాణం..

గతంలో మహాలక్ష్మమ్మ చేసుకున్న దరఖాస్తులో కొన్ని సాంకేతిక లోపాలు దొర్లడంతో, ఆమె ఇటీవల తిరిగి దరఖాస్తు చేసుకున్నారు. ఈ అప్లికేషన్ తాజాగా బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరింది.

భారత పౌరసత్వ చట్టం (Citizenship Act) నిబంధనల ప్రకారం.. పౌరసత్వం పొందే వ్యక్తి అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది.

కలెక్టర్ సమక్షంలో..

బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వినోద్‌కుమార్ వృద్ధురాలి వయసును గౌరవిస్తూ ఆమెను కలెక్టరేట్‌కు పిలిపించి ప్రత్యేకంగా ప్రమాణ స్వీకారం చేయించారు. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తానని, ఇక్కడి చట్టాలకు లోబడి నడుచుకుంటానని మహాలక్ష్మమ్మ దృఢంగా ప్రమాణం చేశారు.

పౌరసత్వం ఎలా లభిస్తుంది?

ఈ సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ పౌరసత్వ ప్రక్రియకు సంబంధించిన తదుపరి వివరాలను వెల్లడించారు.

“మహాలక్ష్మమ్మ చేసిన ప్రమాణ పత్రంతో పాటు, స్థానిక విచారణ ప్రక్రియకు సంబంధించిన పూర్తి నివేదికను మొదట రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతాము. అక్కడి నుండి ఈ ఫైల్ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు (MHA) చేరుతుంది.

అనంతరం కేంద్ర హోంశాఖ ఈ దరఖాస్తును దౌత్యపరమైన క్లియరెన్స్ కోసం అమెరికా ఎంబసీకి పంపిస్తుంది. అక్కడ అమెరికా పౌరసత్వం రద్దు ప్రక్రియ పూర్తయి, అక్కడి నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే మహాలక్ష్మమ్మకు అధికారికంగా భారత పౌరసత్వం లభిస్తుంది.

” 94 ఏళ్ల వయసులో ఈ మట్టిపై ఆమె చూపిన అపారమైన ప్రేమ, నిబద్ధత కలెక్టరేట్ అధికారులతో పాటు స్థానికులను సైతం ఎంతగానో కదిలించింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions