Uber auto driver returns gold | భాగ్యనగరంలో మానవత్వం పరిమళించింది. ఒకవైపు ఐపీఎల్ హడావిడి, మరోవైపు ఎన్నికల వేడి ఉన్నప్పటికీ, ఒక సామాన్య ఆటో డ్రైవర్ చూపిన నిజాయితీ అందరినీ ఫిదా చేస్తోంది.
ఆటోలో మర్చిపోయిన లక్షల విలువైన బంగారాన్ని ఏమాత్రం ఆశపడకుండా పోలీసులకు అప్పగించి తన ఉదారతను చాటుకున్నాడు ఒక ఉబెర్ ఆటో డ్రైవర్. కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన సుజాత అనే మహిళ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వచ్చారు.
శుక్రవారం సాయంత్రం నార్సింగి నుండి బిర్లా మందిర్‌కు వెళ్లడానికి ఆమె ఒక ఉబెర్ ఆటోను ఆశ్రయించారు. అయితే, తొందరలో తన బ్యాగును ఆటోలోనే మర్చిపోయారు. ఆ బ్యాగులో 6.5 తులాల బంగారం మరియు రూ. 3,500 నగదు ఉన్నాయి.
ఖైరతాబాద్ కు చెందిన ఆటో డ్రైవర్ నాగేష్ ప్రయాణికులు దిగిపోయిన తర్వాత వెనుక సీటులో ఉన్న బ్యాగును గమనించారు. అందులో విలువైన వస్తువులు ఉన్నాయని గుర్తించిన ఆయన, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైఫాబాద్ పోలీసులకు సమాచారం అందించారు.
అప్పటికే ఆందోళనతో సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న బాధితురాలు సుజాతకు, పోలీసులు సిసిటివి కెమెరాల సహాయంతో ఆటోను ట్రాక్ చేసే లోపే డ్రైవర్ నాగేష్ అక్కడికి చేరుకున్నారు.
పోలీసులు సమక్షంలో నగలు, నగదును బాధితురాలికి అప్పగించారు. డ్రైవర్ నాగేష్ నిజాయతీని పోలీసులు మెచ్చుకున్నారు.






