Tuesday 29th September 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > రూ. 3 వేల మందుల ధర రూ. 27 వేలా: సుప్రీంకోర్టు

రూ. 3 వేల మందుల ధర రూ. 27 వేలా: సుప్రీంకోర్టు

  • క్యాన్సర్ మందుల ధరలపై ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు!

Supreme Courts Comments On Medicine Price | దేశంలో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే అత్యవసర ఔషధాల ధరల వ్యత్యాసంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటైలర్ కొనుగోలు ధర (PTR – Price to Retailer) రూ. 3,000 ఉన్న ఒక క్యాన్సర్ మందుపై గరిష్ట రిటైల్ ధర (MRP)ని రూ. 27,000గా ముద్రించడాన్ని ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టి, తదుపరి విచారణను అక్టోబర్ 12కు వాయిదా వేసింది.

దోపిడీకి గురవుతున్న రోగులు..

“రూ. 3,000ల ధర ఉన్న క్యాన్సర్ మందు MRP రూ. 27,000గా ఉంది. ఈ అపారమైన వ్యత్యాసాన్ని ఒక్కసారి చూడండి” అని జస్టిస్ సందీప్ మెహతా వ్యాఖ్యానించారు. కార్పొరేట్ ఆసుపత్రులు సేవా దృక్పథంతో కాకుండా లాభాపేక్ష కలిగిన పరిశ్రమలుగా నడుస్తున్నాయని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. రోగులను తమ సొంత ఫార్మసీల నుంచే మందులు కొనాలని ఒత్తిడి చేస్తున్నారని పేర్కొంది.

పన్ను చెల్లింపుదారులపై భారం..

ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద చికిత్స పొందే రోగులకు ఈ పెంచిన ధరల భారం అంతిమంగా పన్ను చెల్లింపుదారులపైనే పడుతోందని కోర్టు గుర్తుచేసింది. రూ. 27,000 ఎమ్ఆర్పీ ఉన్న మందును ఒక నిజాయితీ గల కెమిస్ట్ రూ. 3,000 కే ఇస్తానంటే, ఆ మందు నకిలీదేమోనని రోగి భయపడే పరిస్థితి ఏర్పడిందని, అసలు ఈ మిగిలిన భారీ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్తోందని ప్రశ్నించింది. నిత్యావసర సరుకుల చట్టం కిందకు వచ్చే వైద్య పరికరాలు, ఔషధాలపై నిర్ణీత 16% లాభాల పరిమితిని ఎందుకు కఠినంగా అమలు చేయడం లేదని కోర్టు నిలదీసింది.

కేంద్ర ప్రభుత్వం స్పందన..

కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. ఇది తీవ్రమైన విషయమని, ఈ విపరీతమైన లాభాల మార్జిన్ ఫార్మా కంపెనీలకు వెళ్లడం లేదని, కార్పొరేట్ హాస్పిటల్ నెట్‌వర్క్‌లకే వెళ్తోందని స్పష్టం చేశారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions