Kerala Vigilance Probe CEC Gyanesh Kumar కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌పై నమోదైన అవినీతి, లంచం డిమాండ్ ఆరోపణలపై కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2006లో కేరళ ప్రజాపనుల శాఖ (పీడబ్ల్యూడీ) కార్యదర్శిగా ఆయన పనిచేసిన సమయంలో కాంట్రాక్టు బిల్లులు విడుదల చేసేందుకు రూ. 2 కోట్లు లంచం డిమాండ్ చేశారన్న అంశంపై విజిలెన్స్ విచారణకు కేరళ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17(ఏ) కింద అనుమతి..
కేరళ రాష్ట్ర హోంమంత్రి రమేశ్ చెన్నితల ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ముఖ్యమంత్రి వీడీ సతీశన్‌తో సమగ్రంగా చర్చించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ) కింద విచారణ చేపట్టేందుకు అనుమతించినట్లు తెలిపారు. విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో (VACB) చట్టప్రకారం తదుపరి విచారణ ప్రక్రియను చేపడుతుందని పేర్కొన్నారు.
జ్ఞానేశ్‌కుమార్ ప్రస్తుతం రాజ్యాంగబద్ధమైన సీఈసీ పదవిలో ఉన్నప్పటికీ, గతంలో సర్వీసు అధికారిగా పనిచేసిన సమయంలో జరిగిన ఘటనలపై విచారణ జరిపేందుకు ఎలాంటి ఆటంకం లేదని స్పష్టం చేశారు. సీఈసీ హోదాకు ఉండే రక్షణలు గతంలో పీడబ్ల్యూడీ కార్యదర్శిగా చేసిన నిర్ణయాలకు వర్తించవని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చిందని వివరించారు.
రూ. 2 కోట్ల లంచం ఆరోపణలు..
ఈ విచారణ కేరళ స్టేట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ (KSTP) కింద చేపట్టిన ఎంసీ రోడ్డు విస్తరణ పనులకు సంబంధించినది. KSTP రోడ్డు పనులు చేపట్టిన మలేషియాకు చెందిన ‘పాథిబెల్’ (PATI-BEL) సంస్థకు మెటీరియల్ సరఫరా చేసిన సబ్-కాంట్రాక్టర్ వీ.ఓ. సాజన్ ఈ ఆరోపణలు చేశారు. సుమారు రూ. 17 కోట్ల పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడానికి నాటి పీడబ్ల్యూడీ కార్యదర్శి జ్ఞానేశ్‌కుమార్, మలేషియా ఇంజినీర్ లీ సీ బిన్ నుంచి రూ. 2 కోట్లు లంచం డిమాండ్ చేశారని సాజన్ పేర్కొన్నారు.
ఇంజినీర్ ఆత్మహత్య..
బిల్లులు విడుదల కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మలేషియన్ ఇంజినీర్ లీ సీ బిన్ ఈ విషయాన్ని తనతో చెప్పి ఆత్మహత్య చేసుకున్నారని సాజన్ ఆరోపించారు. 2006లో జరిగిన ప్రాథమిక విమాన విచారణలో ఆయనకు క్లీన్చిట్ ఇవ్వడానికి ప్రయత్నాలు జరిగాయని, తాజా అనుమతితో గత విచారణలో వదిలేసిన కీలక కోణాలను కూడా విజిలెన్స్ బ్యూరో పునఃపరిశీలిస్తుందని తెలిపారు.









