Maharashtra Love Trap Case | మహారాష్ట్రలో వెలుగుచూసిన ఒక అత్యంత దారుణమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రేమ పేరుతో అమాయక బాలికలను ట్రాప్ చేసి, వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న ఒక కామాంధుడి ఉదంతం బట్టబయలైంది.
కేవలం ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 180 మంది బాలికలను మోసం చేసి, లైంగికంగా వేధించిన నిందితుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. మహారాష్ట్ర పరాట్వాడ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్ అనే యువకుడు సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకున్నాడు.
ఇన్ స్టా గ్రాం, ఫేస్‌బుక్ ద్వారా అమ్మాయిలకు దగ్గరై, ప్రేమ పేరుతో వారిని నమ్మించేవాడు. అనంతరం వారిని పూణే, ముంబయి వంటి నగరాలకు తీసుకువెళ్లి లైంగికంగా వేధించేవాడు.
నిందితుడు కేవలం అఘాయిత్యాలకు పాల్పడటమే కాకుండా, ఆ దృశ్యాలను రహస్యంగా రికార్డు చేసేవాడు. నిందితుడి ఫోన్ మరియు గ్యాడ్జెట్స్ లో సుమారు 350కి పైగా అశ్లీల వీడియోలను పోలీసులు గుర్తించారు.
ఈ వీడియోలను చూపిస్తూ బాలికలను బ్లాక్ మెయిల్ చేసేవాడని, కొందరి వీడియోలను ఆన్‌లైన్‌లో కూడా అప్‌లోడ్ చేశాడని విచారణలో తేలింది.
ఈ మృగాడి వలలో చిక్కుకున్న ఒక బాధితురాలు ధైర్యం చేసి రాజ్యసభ ఎంపీ అనిల్ బొండేకు లేఖ రాసింది. తనను రక్షించాలని, నిందితుడి నుండి ప్రాణహాని ఉందని వేడుకుంది. దీనిపై స్పందించిన ఎంపీ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ రాకెట్ వెలుగులోకి వచ్చింది.
రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు అయాజ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతనికి ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. సైబర్ సెల్ అధికారులు నిందితుడు ఆన్‌లైన్‌లో షేర్ చేసిన వీడియోలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.






