Pushpa Jagadish Arrested | ‘పుష్ప’ (Pushpa) సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) పక్కన సహాయ నటుడి (కేశవ) పాత్ర పోషించిన జగదీశ్ (Jagadish) పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓ జూనియర్ ఆర్టిస్టు ఆత్మహత్యకు కారణమయ్యారనే కేసులో జగదీశ్ ను పంజాగుట్ట పోలీసులు బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న ఓ మహిళ మరో వ్యక్తితో ఉన్నప్పుడు ఫొటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరింపులకు పాల్పడినట్ల జగదీశ్ పై ఆరోపణలు వచ్చాయి. జగదీశ్ వేధింపులతో పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న జూనియర్ అర్టిస్టు గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు. మహిళ గత నెల 27న ఓ వ్యక్తితో ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా జగదీశ్ ఫొటోలు తీశాడు. ఆ తర్వాత ఆమెను బెదిరించాడు.
దీంతో మనస్తాపానికి గురైన మహిళ ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ కేసులో అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న బండారు జగదీశ్ ని బుధవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. ఆత్మహత్య చేసుకున్న మహిళతో గతంలో జగదీశ్ కి సినీ రంగంలో పరిచయం ఉందని పోలీసులు తెలిపారు.