– సమన్వయం కోసం ప్రత్యేక అధికారి నియామకం!
CM Revanth On CSR Funds | కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులను కేవలం ఖర్చుగా చూడకుండా, సమాజాభివృద్ధిలో భాగస్వామ్యంగా భావించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కార్పొరేట్ సంస్థలకు పిలుపునిచ్చారు.
బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన ఆయన, సీఎస్ఆర్ నిధుల వినియోగంపై ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు.
కంపెనీలు చేసే ప్రతి రూపాయి వ్యయం వందకు వంద శాతం సత్ఫలితాలను ఇచ్చేలా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన కీలక సూచనలు చేశారు.
ప్రస్తుత ప్రభుత్వం విద్య, వైద్యం, జల వనరుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. వీటితో పాటు నైపుణ్య శిక్షణ, వారసత్వ కట్టడాల పరిరక్షణ, అడవుల సంరక్షణ వంటి రంగాలను కంపెనీలు తమ ఇష్టానుసారం ఎంచుకోవచ్చు.
రాష్ట్రంలోని మొత్తం విద్యార్థుల్లో 44 శాతం మంది హైదరాబాద్‌లోనే ఉన్నారని, వారికి నాణ్యమైన విద్య, సౌకర్యాలు అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. కంపెనీలు ఆయా ప్రాంతాల్లోని మౌలిక వసతులను వినియోగించుకుంటున్నందున, తమ సీఎస్ఆర్ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని అదే ప్రాంత అభివృద్ధికి కేటాయించాలని సూచించారు.
సీఎస్ఆర్ నిధుల వినియోగంలో ఇప్పటివరకు సరైన విధానం లేనందున, దీనిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని (Special Chief Secretary) నియమించినట్లు సీఎం వెల్లడించారు. కంపెనీ ప్రతినిధులు ఈ అధికారితో నేరుగా సమన్వయం చేసుకొని తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో నిధులు వెచ్చించవచ్చని తెలిపారు.
ముఖ్యమంత్రి పిలుపునకు స్పందించి పలు కంపెనీలు విద్యాభివృద్ధికి భారీ విరాళాలను ప్రకటించాయి.
- రహేజా గ్రూప్: రూ. 50 కోట్లు
- రాంకీ గ్రూప్: రూ. 50 కోట్లు
- యశోద ఫౌండేషన్: రూ. 10 కోట్లు
ఈ సంస్థల ప్రతినిధులను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ద్వారా తెలంగాణ విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.







