Sunday 31st May 2026
12:07:03 PM
Home > తాజా > ‘మా గోస వినుర్రి సార్..’ ఓ ‘ఆర్టిజన్’ ఆవేదన!

‘మా గోస వినుర్రి సార్..’ ఓ ‘ఆర్టిజన్’ ఆవేదన!

tgspdcl

Telangana Artisan Worker Emotional Letter | “ఉదయం ఆఫీసుకెళ్తే.. సాయంత్రం ఇంటికి క్షేమంగా వస్తామన్న గ్యారెంటీ లేని బతుకులు మావి సార్.  మేము తెలంగాణ విద్యుత్ శాఖలో ఆర్టిజన్లుగా పనిచేస్తున్నాం. మా బతుకు గోసను ఒక్కసారి వినండి సార్” అంటూ ఒక ఆర్టిజన్ కార్మికుడు (కె. ప్రసాద్) తన ఆవేదనను అక్షర రూపంలో వెలిబుచ్చిన తీరు ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది.  

తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాల్లో వెన్నంటి నిలిచిన ఈ కార్మికులు, నేడు తమ ఉనికి కోసం, కనీస హక్కుల కోసం అధికారుల కాళ్ల వేళ్లా పడాల్సిన దుస్థితి నెలకొంది.

కరెంట్ స్తంభం ఎక్కే ప్రతిసారీ మృత్యువుతో పోరాటం చేస్తూ, 24 గంటలు ప్రజల కోసం శ్రమిస్తున్న ఈ కార్మికుల జీవితాలు గందరగోళంలో పడ్డాయి. తోటి కార్మికులు కళ్ల ముందే కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోతుంటే, ఆ గుండె కోతను దిగమింగుకుని మళ్లీ అదే స్తంభం ఎక్కాల్సిన పరిస్థితి.

“మీకేం సార్.. కరెంట్ లోళ్లు.. మస్తు జీతాలు వస్తాయి” అని సమాజం అంటుంటే, ఆ మాటల వెనుక ఉన్న నిస్సహాయతను ఎవరికి చెప్పుకోవాలో తెలియక వారు తల్లడిల్లుతున్నారు.

ప్రాణాలకు తెగించి చీకటిని తరిమే తమ బతుకుల్లో వెలుగులు ఎప్పుడు నిండుతాయా అని వారు ఎదురుచూస్తున్నారు.

తెలంగాణ వస్తే జీవితాలు బాగుపడతాయని, రెగ్యులర్ అవుతామని నమ్మిన ఈ కార్మికులకు ‘ఆర్టిజన్’ అనే కొత్త పేరు పెట్టి, హక్కులను కాలరాస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు.

ప్రభుత్వాలు మమ్మల్ని పర్మనెంట్ చేశామని చెబుతుంటే, విద్యుత్ సంస్థలు మాత్రం మీరు ఇప్పటికీ తాత్కాలిక ఉద్యోగులేనని అనడం వీరిని మరింత కుంగదీస్తోంది.

పెరిగిన ఖర్చుల దృష్ట్యా వచ్చే జీతాలు సరిపోక, మరోవైపు సమ్మె చేస్తామంటే ఉద్యోగాల నుంచి తీసేస్తామన్న బెదిరింపుల మధ్య నలిగిపోతున్నారు.

ఒక్కసారి మా బతుకుల్లోకి తొంగిచూడండి సార్..
సీఎండీలు, ఉన్నతాధికారులు ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకోవడం కాకుండా, ఒక్కసారి క్షేత్రస్థాయిలోకి వచ్చి మా కష్టాలను చూడాలని, మాతో మాట్లాడాలని ఆర్టిజన్ కార్మికులు వేడుకుంటున్నారు.

“మా ప్రాణాలకు తెగించి మేము చేస్తున్న పనికి.. మాకొచ్చే జీతాలకు పొంతన ఉందో లేదో ఒక్కసారి ఆలోచించండి సార్!” అన్న వారి ప్రశ్న మన సామాజిక బాధ్యతను ప్రశ్నిస్తోంది.

You may also like
tgspdcl
ఏప్రిల్ 8 నుంచి విద్యుత్ ఆర్టిసన్ల నిరవధిక సమ్మె!
TGSPDCL FIELD WORKERS
జోరు వర్షంలోనూ మరమ్మతులు.. విద్యుత్ కార్మికుల సాహసం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions