Congress MLA Niece Dr Ankita Yaragal Removed అది ప్రభుత్వ ఆసుపత్రి.. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన నమ్మ క్లినిక్. అక్కడ రోజూ రోగులు వైద్యుల కోసం ఎదురుచూస్తుంటే, సంబంధిత మెడికల్ ఆఫీసర్ మాత్రం హాయిగా ఓ ప్రైవేట్ కాలేజీలో పీజీ చదువుకుంటున్నారు.
విధులకు ముఖం చాటేస్తున్నా ప్రతీ నెలా ఖాతాలో రూ. 70 వేలకు పైగా జీతం మాత్రం పడిపోతోంది. ఈ నిర్వాకం సాగించింది మరెవరో కాదు, ఏకంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేనకోడలే! కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.
బాగల్‌కోట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమేష్ మేటి మేనకోడలు డాక్టర్ అంకిత యారగళ్‌ను అధికారులు విధి నిర్వహణ నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్లినిక్‌కు సరిగా హాజరుకాకపోవడం, ఒకే సమయంలో రెండు చోట్ల బాధ్యతలు నిర్వర్తించడం (డ్యూటీ చేస్తూ పీజీ చదువుతుండటం)పై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు.
రోగుల ఇబ్బందులతో బయటపడ్డ నిజం..
గత మార్చి నెల నుంచి బాగల్‌కోట్‌లోని నమ్మ క్లినిక్‌కు డాక్టర్ అంకిత సరిగా హాజరుకావడం లేదు. దీంతో క్లినిక్‌కు వచ్చే పేద రోగులకు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో అధికారులు దృష్టి సారించారు. విధులకు గైర్హాజరైనప్పటికీ ఆమె ప్రతీ నెలా రూ. 70,000 పైగా జీతాన్ని తీసుకుంటున్నట్లు బాగల్‌కోట్ జిల్లా పంచాయతీ సీఈఓ గజానన్ బేలే తనిఖీల్లో గుర్తించారు.
విచారణకు రాని ఎమ్మెల్యే మేనకోడలు..
ఈ అక్రమాలపై వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చి, మొదటి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఆమె చదువుతున్న కాలేజీ ప్రిన్సిపాల్ అనుమతి ఇచ్చినప్పటికీ, ఆమె విచారణకు రాకుండా మొండికేశారు. బాధ్యతా రాహిత్యంతో ప్రవర్తించిన డాక్టర్ అంకితను జిల్లా వైద్యాధికారి రాజ్‌కుమార్ యారగళ్ వెంటనే విధుల్లోంచి తొలగించారు. ఆమె అనధికారికంగా పొందిన జీతాన్ని రికవరీ చేస్తామని హెచ్చరించారు.
మెడికల్ కౌన్సిల్‌కు ఫిర్యాదు..
ప్రొఫెషనల్ మిస్‌కండక్ట్ కింద ఆమెపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక మెడికల్ కౌన్సిల్ (KMC), నేషనల్ మెడికల్ కమిషన్ (NMC)లకు సిఫార్సు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. డాక్టర్ అంకిత మాజీ సీఎం సిద్ధరామయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ అగ్రనేతలతో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకునేవారని, ఆ ప్రభావంతోనే ఇలా ప్రవర్తించి ఉండవచ్చని చర్చ జరుగుతోంది.







