- 50 శాతం సీట్ల పెంపు,
- జనగణనతో సంబంధం లేకుండా డీలిమిటేషన్‌కు ప్రతిపాదన..
- నేడే కేబినెట్ భేటీ
Lok Sabha Seats Hike దేశ రాజకీయాల్లో కీలక మలుపునకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియకు సంబంధించి రెండు ప్రధాన ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచడం, అలాగే డీలిమిటేషన్ ప్రక్రియను జనగణన (Census) నుంచి వేరు చేయడం (Delinking) అనే అంశాలపై కసరత్తు జరుగుతోంది. శుక్రవారం (నవంబర్ 27) మధ్యాహ్నం 1 గంటకు జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం ఈ ప్రతిపాదనలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కోసమే ఈ కసరత్తు..
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు: నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. నవంబర్ 30న లోక్‌సభ, డిసెంబర్ 2న రాజ్యసభ సమావేశం కానున్నాయి. ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడిన వర్షాకాల సమావేశాలను అధికారికంగా ప్రోరోగ్ చేయకపోవడంతో ఈ ప్రత్యేక భేటీ జరుగుతోంది.
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో అనుసంధానిస్తూ తెచ్చిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, 2026కు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మద్దతు ప్రకటించారు. ఈ బిల్లును విపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. గత ఏప్రిల్‌లో ఈ బిల్లుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో వీగిపోయిన సంగతి తెలిసిందే.
పార్లమెంట్లో మారిన బలాబలాలు..
543 స్థానాలున్న లోక్‌సభలో ప్రస్తుతం మూడు ఖాళీలు ఉండగా 540 మంది సభ్యులున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 361 ఓట్లు అవసరం. అధికార ఎన్డీయే కూటమికి దాదాపు 320 మంది ఎంపీల బలం ఉంది.
ఇటీవల 20 మంది తిరుగుబాటు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీలు పార్టీని వీడి ఎన్సీపీఐ (NCPI)లో విలీనమై ఎన్డీయేకు మద్దతు ప్రకటించారు. అలాగే ఆరుగురు శివసేన (యూబీటీ) ఎంపీలు ఏక్నాథ్ షిండే వర్గంలో చేరడంతో విపక్ష శిబిరం నుంచి మొత్తం 26 మంది ఎంపీలు బయటకు వచ్చారు.
అయినప్పటికీ 361 మార్కును చేరుకోవడానికి ప్రభుత్వానికి ఇంకా అదనపు మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో 22 మంది ఎంపీలున్న డీఎంకే, 8 మంది ఎంపీలున్న ఎన్సీపీ (శరద్ పవార్) నిర్ణయం కీలకం కానుంది. మరోవైపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అవకతవకల ఆరోపణలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో విపక్షాలు ప్రత్యేక సమావేశాల్లో నిరసనలకు సిద్ధమవుతున్నాయి.







