Monday 16th November 2026
12:07:03 PM
Home > క్రైమ్ > హత్య కుట్ర వార్తల వేళ అమితాబ్ బచ్చన్ ఆసక్తికర పోస్ట్!

హత్య కుట్ర వార్తల వేళ అమితాబ్ బచ్చన్ ఆసక్తికర పోస్ట్!

Amitabh Bachchan Bach Gaye Post బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తనపై హత్య కుట్ర జరిగిందన్న వార్తల నేపథ్యంలో సోషల్ మీడియాలో పెట్టిన ఒక చిన్న పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సోమవారం (నవంబర్ 16) అమితాబ్ తన బ్లాగ్/సోషల్ మీడియా వేదికగా కేవలం “బచ్ గయే” (Bach gaye – బతికిపోయాం/తప్పించుకున్నాం) అంటూ రెండు పదాలతో కూడిన ఒక మిస్టరీ పోస్ట్ (Cryptic post) షేర్ చేశారు.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు షూటర్లు అమితాబ్ బచ్చన్‌పై కాల్పులు జరిపేందుకు కుట్ర పన్నారని, వారిని పోలీసులు అరెస్ట్ చేశారన్న వార్తలు వెలువడిన మూడు రోజుల తర్వాత బిగ్ బీ ఈ విధంగా స్పందించడం గమనార్హం.

పోలీసుల విచారణలో సంచలన విషయాలు..

నవంబర్ 13న ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు వేర్వేరు చోట్ల దాడులు చేసి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు షూటర్లను అరెస్ట్ చేశారు. ఢిల్లీలో వికాస్ ఠాకూర్‌ను, ముంబైలో దీపక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు దీపక్ సంచలన విషయాలు వెల్లడించినట్లు ఇండియా టుడే కథనం పేర్కొంది.

విదేశాల్లో తలదాచుకున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌స్టర్ నుండి తనకు ఆదేశాలు అందాయని, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముంబైకి చెందిన ప్రముఖ బాలీవుడ్ నటుడిపై కాల్పులు జరపాలని ఆదేశించినట్లు తెలిపాడు. పోలీసుల ప్రకటనలో నటుడి పేరు నేరుగా వెల్లడించనప్పటికీ, గతంలో 1984 అల్లర్ల వివాదం ఎదుర్కొన్నది అమితాబ్ బచ్చన్ కావడంతో ఆ టార్గెట్ ఆయనేనని స్పష్టమైంది.

అరెస్టయిన షూటర్ దీపక్ గతంలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కుట్ర జరిగిన సమయంలోనూ ముంబైలో ఉన్నట్లు విచారణలో తేలింది. అదనంగా ముంబై మేయర్‌కు వచ్చిన బాంబు బెదిరింపు లేఖలోనూ అమితాబ్ పేరు ప్రస్తావించబడింది.

బాలీవుడ్‌పై మళ్లీ అండర్ వరల్డ్ కన్ను?

సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య, ఇప్పుడు అమితాబ్ బచ్చన్, టైగర్ ష్రాఫ్‌లకు బెదిరింపుల వెనుక బాలీవుడ్‌ను భయభ్రాంతులకు గురిచేసి భారీగా డబ్బు వసూలు (Extortion) చేయాలనే కుట్ర ఉన్నట్లు భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. 1990లలో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ తరహాలోనే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ విస్తరిస్తోందని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఇప్పటికే కోర్టుకు నివేదించింది.

మరోవైపు, ఈ బెదిరింపుల వార్తలు వస్తున్నప్పటికీ అమితాబ్ బచ్చన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. నవంబర్ 15న (ఆదివారం) ఛత్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, తన నివాసం ‘జల్సా’ వెలుపల ఎలాంటి బుల్లెట్ ప్రూఫ్ అద్దం రక్షణ లేకుండానే అభిమానులకు అభివాదం (Sunday Darshan) చేశారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions