- 174 మంది ప్రాణాలు సురక్షితం!
Flydubai Flight Hijack Attempt దుబాయ్ నుంచి ఇస్రాయెల్లోని తెల్ అవీవ్‌కు బయలుదేరిన ‘ఫ్లైదుబాయ్’ (FZ 1073) విమానంలో అత్యంత నాటకీయ, భయాందోళనకర సంఘటన చోటుచేసుకుంది. ఒమన్ దేశానికి చెందిన సహ-పైలట్ (Co-pilot) విమానాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్ని, కాక్‌పిట్‌లోనే ఇండియన్ కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై తీవ్రంగా దాడి చేసి కత్తితో పొడిచాడు.
అత్యంత దారుణంగా గాయపడినప్పటికీ కెప్టెన్ స్మిత్, ప్రయాణికులు మరియు ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీంతో విమానంలోని 174 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.
గాయపడినా కాక్‌పిట్ డోర్ తెరిచిన ఇండియన్ కెప్టెన్..
కత్తిపోట్లకు గురై తీవ్ర రక్తస్రావం అవుతున్నప్పటికీ కెప్టెన్ స్మిత్ మచ్చార్ అత్యంత సాహసంతో కాక్‌పిట్ డోర్ అన్‌లాక్ చేశారు. ఇది జరగకపోతే లోపల ఉన్న కో-పైలట్‌ను అడ్డుకోవడం ఎవరికీ సాధ్యమయ్యేది కాదు. కాక్‌పిట్ డోర్ తెరవగానే ప్లాంబర్ యానివ్ హయున్, డెంటిస్ట్ డాక్టర్ షోటా ముసేవ్, అసఫ్ రజువాన్, జ్వికా మనేస్ అనే నలుగురు ప్రయాణికులు ప్రాణాలకు తెగించి కాక్‌పిట్‌లోకి దూసుకెళ్లారు. హెడ్‌ఫోన్ వైర్ల సహాయంతో కో-పైలట్‌ను బంధించి అదుపులోకి తీసుకున్నారు.
టీవీ షో చూసి విమానాన్ని అదుపు చేసిన ప్లాంబర్..
విమానం కేవలం 2 నిమిషాల్లో 17,000 అడుగుల కిందకు పడిపోతున్న తరుణంలో, యానివ్ హయున్ అనే ప్లాంబర్ కాక్‌పిట్ లివర్లను పైకి లాగి విమానం వేగంగా కిందకు పడకుండా కొంతవరకు స్థిరీకరించాడు. తాను రెగ్యులర్‌గా చూసే ‘మేడే’ (Mayday) అనే విమాన ప్రమాదాల డాక్యుమెంటరీ టీవీ షో ద్వారానే ఈ అవగాహన వచ్చిందని ఆయన తెలిపాడు.
సమయానికి స్పందించిన ఆఫ్-డ్యూటీ పైలట్లు..
అదృష్టవశాత్తూ అదే విమానంలో ప్రయాణికులుగా ఉన్న ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు వెంటనే కాక్‌పిట్‌లోకి వచ్చి విమాన నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకుని, సౌదీ అరేబియాలోని తబుక్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. వేగంగా కిందకు పడిపోవడం వల్ల విమానం తోక భాగంలో ఉన్న రడ్డర్ (Rudder) తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, విమానం ప్రమాదానికి గురికాకుండా సురక్షితంగా ల్యాండ్ కావడం ఒక అద్భుతమని ఏవియేషన్ నిపుణులు పేర్కొన్నారు.







