Death Threat Letter To Sourav Ganguly | భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి తీవ్రమైన బెదిరింపులు ఎదురయ్యాయి.
తనను, తన భార్య డోనా గంగూలీని చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు హెచ్చరిక లేఖలు పంపారని, దీనిపై గంగూలీ కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొన్ని నెలలుగా వస్తున్న ఈ లేఖల వ్యవహారం ఇప్పుడు క్రీడా వర్గాల్లోనూ, కోల్‌కతా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఆరు నెలలుగా బెదిరింపు లేఖలు – పోలీసులకు ఫిర్యాదు
సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఆరు నెలలుగా గంగూలీ పేరిట ఈ బెదిరింపు లేఖలు వస్తున్నాయి.
ప్రారంభంలో ఈ లేఖలను పెద్దగా పట్టించుకోనప్పటికీ, నిన్న ఆయన కార్యాలయానికి అందిన రెండు లేఖల్లో “నిన్ను, నీ భార్యను చంపేస్తాం. నీకు సన్నిహితంగా ఉండేవారికి హాని తలపెడతాం” అని స్పష్టంగా పేర్కొనడంతో గంగూలీ అప్రమత్తమయ్యారు.
వెంటనే తన మేనేజర్ ద్వారా కోల్‌కతాలోని ఠాకూర్‌పుకుర్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.
ఉత్తర 24 పరగణాల లింక్ – విచారణ వేగవంతం..
లేఖల మూలాలను, వాటిని పంపిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బెల్ఘరియా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కొరియర్ సర్వీస్ ద్వారా ఈ లేఖలను పంపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితుడు వాడినట్లుగా భావిస్తున్న సిమ్ కార్డు కదలికలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. సంబంధిత కొరియర్ ఏజెన్సీ నుంచి సేకరించిన మొబైల్ నంబర్‌ను ట్రేస్ చేస్తున్నారు. ఈ బెదిరింపుల వెనుక ఉన్న అసలు కారణాన్ని త్వరలోనే నిగ్గు తేలుస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.









