Tuesday 22nd September 2026
12:07:03 PM
Home > క్రైమ్ > Rent A Boy Friend: అమ్మాయికు సీపీ సజ్జనర్ హెచ్చరిక!

Rent A Boy Friend: అమ్మాయికు సీపీ సజ్జనర్ హెచ్చరిక!

Rent A Boyfriend Scam | యువతులే లక్ష్యంగా సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్న ఒక కొత్త సైబర్ మోసాన్ని హైదరాబాద్ పోలీసులు వెలుగులోకి తెచ్చారు.

‘అద్దెకు బాయ్‌ఫ్రెండ్’ (Rent a Boyfriend) సేవలు, భారీ డిస్కౌెంట్ల పేరిట వస్తున్న ఆకర్షణీయమైన ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

నకిలీ ప్రొఫైల్స్, కల్పిత డేటింగ్ ఆఫర్లను ఎరగా వేసి మోసగాళ్లు డబ్బుతో పాటు వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఆఫర్లు, ప్యాకేజీల వెనుక అసలు నిజం..

ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో కాఫీ డేట్స్, సినిమాలకు వెళ్లడం, షాపింగ్‌లో తోడుగా ఉండటం, పెళ్లిళ్లు లేదా ఈవెంట్లకు క్లయింట్లతో కలిసి వెళ్లడం వంటి సేవల పేరిట పోస్టులు ప్రచారంలో ఉన్నాయి.

ఒక చిన్నపాటి సమావేశానికి కొన్ని వందల రూపాయల నుండి, రోజంతా తోడుగా ఉండేందుకు కొన్ని వేల రూపాయల వరకు ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. వీటిని ‘50% తగ్గింపు’, ‘ప్రత్యేక ఆఫర్లు’ అనే ఆకర్షణీయమైన ప్రకటనలతో ప్రచారం చేస్తున్నారు.

సైబర్ మోసగాళ్లు నమ్మకం కలిగించడానికి అందమైన పురుషుల ఫోటోలు, ఏఐ (AI) ద్వారా రూపొందించిన లేదా ఇంటర్నెట్ నుండి సేకరించిన చిత్రాలతో నకిలీ ప్రొఫైల్స్ తయారు చేస్తున్నారని హైదరాబాద్ సీపీ వి.సి. సజ్జనార్ తెలిపారు.

ఎలా మోసం చేస్తున్నారు?

ప్రకటనలకు స్పందించే మహిళలను ప్రైవేట్ చాట్‌లకు మళ్లించి, బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యూరిటీ డిపాజిట్ లేదా అడ్వాన్స్ పేమెంట్ పేరిట క్యూఆర్ కోడ్‌లు, డిజిటల్ వాలెట్ల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బు జమ కాగానే మోసగాళ్లు బాధితులను బ్లాక్ చేసి అదృశ్యమవుతారు.

ఈ మోసం కేవలం ఆర్థిక నష్టానికే పరిమితం కాదు. చాటింగ్ సమయంలో పంచుకున్న వ్యక్తిగత వివరాలు, ఫోన్ నంబర్లు, ఫోటోలను వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్‌కు ఉపయోగించే ప్రమాదం ఉంది. అంతేకాకుండా తెలియని వ్యక్తులను కలవడం వల్ల శారీరక భద్రతకు కూడా ముప్పు వాటిల్లుతుందని సీపీ హెచ్చరించారు.

పోలీసుల సూచనలు

అసాధారణమైన ఆన్‌లైన్ ఆఫర్లను గుడ్డిగా నమ్మవద్దు.
అపరిచితులకు వ్యక్తిగత సమాచారం, ఫోటోలు పంపవద్దు.
ధృవీకరణ లేని ఖాతాలకు ముందస్తు చెల్లింపులు చేయకూడదు.
సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) ద్వారా ఫిర్యాదు చేయాలి.

You may also like
డ్రగ్స్‌ నియంత్రణలో తెలంగాణకు జాతీయ గుర్తింపు!
రూ. 8 కోట్లతో భారీ సెంట్రలైజ్డ్ కిచెన్!
ప్రిన్స్ రహీమ్ అగాఖాన్ Vతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ!
మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions