Dhanush Donates Building To His School | తమిళ సినీ స్టార్, జాతీయ అవార్డు గ్రహీత నటుడు ధనుష్ తన ఉదారతతో అందరి మనసులను గెలుచుకున్నారు. తాను పదో తరగతి వరకు చదువుకున్న పాఠశాలకు అత్యంత విలువైన కానుకను అందించారు.
చెన్నైలోని సాలిగ్రామంలో ఉన్న ‘తాయ్ సత్య మెట్రిక్యులేషన్ పాఠశాల’ కు తన సొంత ఖర్చులతో మూడు అంతస్తుల నూతన భవనాన్ని నిర్మించి విరాళంగా ఇచ్చారు. ఈ భవనానికి పాఠశాల యాజమాన్యం ‘ధనుష్ బ్లాక్’ అని పేరు పెట్టడం విశేషం.
ఉపాధ్యాయుల పాదాభివందనం..
ఇటీవల ఈ కొత్త భవనం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ధనుష్ తన స్కూల్ మేట్, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కుమరన్‌తో కలిసి హాజరయ్యారు. వీరిద్దరూ 1999 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు.
కార్యక్రమంలో పాల్గొన్న ధనుష్, తన చిన్ననాటి ఉపాధ్యాయులందరి పాదాలకు నమస్కరించి, వారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం గురువులతో కలిసి ఫొటోలు దిగారు. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని తీవ్ర భావోద్వేగానికి గురిచేసాయి.
పాఠశాల పాత భవనాల పరిస్థితి సరిగ్గా లేదని తెలుసుకుని ధనుష్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ 3 అంతస్తుల భవనాన్ని నిర్మించారని సినిమాటోగ్రాఫర్ కుమరన్ తెలిపారు. అంతేకాకుండా పాత భవనాలను పునరుద్ధరించడంతో పాటు, ఖాళీ స్థలాల్లో మరిన్ని భవనాలు నిర్మిస్తానని ధనుష్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
ఎల్‌కేజీ నుంచి సినిమా వరకు స్నేహం..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినిమాటోగ్రాఫర్ కుమరన్, ఆయన భార్య లక్ష్మీ కృప తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. “మేము ముగ్గురం ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు ఇదే స్కూల్లో చదివాం. ఆ తర్వాత ధనుష్‌తో కలిసి వేరే పాఠశాలలో ఇంటర్ పూర్తి చేశాను.
ధనుష్ సినిమాల్లోకి వెళ్లగా, నేను ఇంజినీరింగ్ ముగించి సినిమాటోగ్రాఫర్ అయ్యాను. ‘తంగమగన్’ వంటి చిత్రాల్లో ధనుష్‌తో కలిసి పనిచేశాను. ధనుష్ చేసిన ఈ సాయం మమ్మల్ని ఎంతో కదిలించింది” అని కుమరన్ పేర్కొన్నారు.
రెండు జాతీయ అవార్డులు – క్రేజీ ప్రాజెక్టులు..
ఇటీవల ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ధనుష్ నటుడిగా ఒకటి, దర్శకుడిగా మరోటి.. ఇలా రెండు జాతీయ అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆయన రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓం’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.








