Govt On E20 Petrol Use | ఈ20 (20 శాతం ఇథనాల్ కలిపిన) పెట్రోల్ వాడటం వల్ల వాహనాల ఇంజిన్‌లు దెబ్బతింటాయనే ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.
అయితే, ఈ10 పెట్రోల్‌కు అనుగుణంగా తయారు చేసిన పాత వాహనాల్లో మైలేజీ 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని రాజ్యసభలో తెలిపింది.
మైలేజీ తగ్గడం అనేది కేవలం ఇథనాల్ శాతంపైనే ఆధారపడి ఉండదని కేంద్ర ప్రభుత్వం వివరించింది. దీనికి అనేక ఇతర అంశాలు కూడా కారణమవుతాయని పేర్కొంది.
వాహనాన్ని నడిపే తీరు, టైర్లలో సరైన గాలి ఒత్తిడి (Air Pressure), వీల్ అలైన్‌మెంట్, వాహనంలో ఏసీ (AC)ని ఎక్కువగా వాడటంపై ఆధారపడి ఉంటుదని తేలింది.
ఈ20 పెట్రోల్‌తో కలిగే ప్రయోజనాలు..
ఈ20 పెట్రోల్ వల్ల వాహనాలకు అనేక ప్రయోజనాలు కూడా ఉంటాయని ప్రభుత్వం వివరించింది. ఇంధనం మెరుగ్గా మండే సామర్థ్యం పెరుగుతుంది. ఇంజిన్‌లో వచ్చే అనవసర శబ్దాలు (Knocking) తగ్గుతాయి. వాహనం నడిపే సమయంలో పికప్ చాలా సాఫీగా ఉంటుంది అని కేంద్ర వివరించింది.
ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ20 పెట్రోల్‌పై వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. ఈ20 ఇంధనం వల్ల దేశంలో ఏ ఒక్క కారు దెబ్బతిన్నట్లు ఆధారాలు లేవన్నారు. ఇటువంటి ఆరోపణలు కేవలం తప్పుడు ప్రచారంలో భాగమేనని ఆయన వ్యాఖ్యానించారు.








