Friday 26th June 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘ఇస్లాంలోకి మారినా ‘బీసీఎం’ రిజర్వేషన్ రాదు..’

‘ఇస్లాంలోకి మారినా ‘బీసీఎం’ రిజర్వేషన్ రాదు..’

  • మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు!

Madras High Court On BCM Reservation | మత మార్పిడి మరియు రిజర్వేషన్ల అంశంపై మద్రాస్ హైకోర్టు (Madras High Court) ఒక సంచలన తీర్పు వెల్లడించింది.

హిందూ మతం నుండి ఇస్లాంలోకి మారిన వ్యక్తులకు బ్యాక్‌వర్డ్ క్లాస్ ముస్లిం (BCM) కోటా కింద రిజర్వేషన్లు కల్పించాలంటూ గతంలో తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను (GO) కోర్టు రద్దు చేసింది.

ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ జీఆర్ స్వామినాథన్, జస్టిస్ పీబీ బాలాజీలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.

గత డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ఏంటంటే..

2024 మార్చి 9న ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని అప్పటి డీఎంకే ప్రభుత్వం ఒక వివాదాస్పద ఉత్తర్వును జారీ చేసింది.

దీని ప్రకారం.. హిందూ సమాజంలోని బీసీ (BC), ఎంబీసీ (MBC), డీఎన్‌సీ (DNC), ఎస్సీ (SC) వర్గాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా ఇస్లాం మతంలోకి మారితే, వారిని ‘బ్యాక్‌వర్డ్ క్లాస్ ముస్లిం’ (BCM) కేటగిరి కింద పరిగణించి రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తామని పేర్కొంది.

తమిళనాడులో అధికారికంగా గుర్తింపు పొందిన ఏడు బీసీఎం ముస్లిం వర్గాలలో ఒకటిగా సదరు వ్యక్తులకు కమ్యూనిటీ సర్టిఫికెట్లు జారీ చేయాలని కూడా ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ.. ‘పుట్టుక ఆధారిత వర్గాలు’..

ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో చట్టబద్ధం కాదని మద్రాస్ హైకోర్టు తేల్చిచెప్పింది. ఇస్లాంలోకి మారిన ఒక వ్యక్తి కేవలం ‘ముస్లిం’గా మాత్రమే గుర్తింపు పొందుతాడు తప్ప, ఆటోమేటిక్‌గా బ్యాక్‌వర్డ్ క్లాస్ ముస్లిం (BCM) హోదాను డిమాండ్ చేయలేడని ధర్మాసనం పేర్కొంది.

“హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారిన వ్యక్తి ముస్లింగా మారతాడు. కానీ అతను లబ్బాయి, రావుతర్, మరక్కయర్ లేదా ఇతర ప్రత్యేక ముస్లిం ఉప వర్గాలకు చెందినవాడిగా మారలేడు.

ఎందుకంటే ఆయా వర్గాలు పుట్టుక (Birth) ఆధారంగా నిర్ణయించబడినవి. కేవలం మతం మారినంత మాత్రాన ఆ వర్గాలలో సభ్యత్వం లేదా హక్కు పొందడం సాధ్యం కాదు.” అని మద్రాస్ హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

తమిళనాడులో ప్రస్తుతం బీసీఎం (BCM) కేటగిరి కింద కేవలం ఏడు ముస్లిం వర్గాలకు మాత్రమే గుర్తింపు ఉంది. అవి: అన్సార్, డెక్కాని ముస్లింలు, దూదేకుల, లబ్బాయి, మాపిళ్ల, షేక్ మరియు సయ్యద్.

పిటిషనర్ సమీర్ అహ్మద్ కేస్ కొట్టివేత..

ఈ తీర్పునకు దారితీసిన నేపథ్యాన్ని పరిశీలిస్తే.. 2015లో ఒక హిందూ కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఇస్లాం మతాన్ని స్వీకరించి, తన పేరును ‘సమీర్ అహ్మద్‌’గా మార్చుకున్నాడు.

ఆ తర్వాత తనకు ‘ముస్లిం లబ్బాయి’ వర్గానికి చెందిన కమ్యూనిటీ సర్టిఫికెట్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా, 2022లో స్థానిక తహసీల్దార్ ఆ అభ్యర్థనను తిరస్కరించారు. దీనిపై సమీర్ అహ్మద్ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై సమగ్ర విచారణ జరిపిన ధర్మాసనం.. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులే రాజ్యాంగ విరుద్ధమని తేలుస్తూ, సమీర్ అహ్మద్ దాఖలు చేసిన పిటిషన్‌ను పూర్తిగా కొట్టివేసింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions