- కేంద్ర మంత్రి హార్దీప్ సింగ్ పూరి అధికారిక ప్రకటన!
Gas And Oil Reserves Discovered In Andaman And Nicobar Islands | భారత ఇంధన రంగానికి భారీ లబ్ధి చేకూర్చే విధంగా అండమాన్ నికోబార్ ద్వీపాల్లో భారీ సహజ వాయువు (గ్యాస్), చమురు నిక్షేపాలు బయటపడ్డాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా అధికారికంగా ప్రకటించింది.
దేశీయ ఇంధన లభ్యతను గణనీయంగా పెంచే ఈ గ్యాస్ నిల్వలకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హార్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.
సముద్ర గర్భంలో 1,900 మీటర్ల లోతులో లభ్యం..
అండమాన్ తూర్పు తీరానికి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలోని ‘శ్రీ విజయపురం-3’ అనే ప్రాంతం వద్ద ఈ గ్యాస్ నిల్వలను కనుగొన్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు.
సముద్ర గర్భంలో 355 మీటర్ల లోతున ఉన్న ఇయోసీన్ (Eocene) పొరలో, ఏకంగా 1,900 మీటర్లకు పైగా లోతులో నిర్వహించిన ప్రాథమిక ఉత్పత్తి పరీక్షల్లో (Production Tests) గ్యాస్ ఉనికి స్పష్టంగా బయటపడిందని ఆయన వివరించారు.
ఆయిల్ ఇండియా లిమిటెడ్ ముమ్మర పరిశోధనలు..
ప్రస్తుతం ఇక్కడ లభ్యమైన సహజ వాయువు నాణ్యతను, అలాగే దాని కెలోరిఫిక్ విలువను (Calorific Value) ఖచ్చితంగా అంచనా వేయడానికి ప్రభుత్వ రంగానికి చెందిన ‘ఆయిల్ ఇండియా లిమిటెడ్’ (OIL) ముమ్మరంగా శాంప్లింగ్ పనులను చేపట్టిందని మంత్రి హార్దీప్ సింగ్ పూరి తెలిపారు.
ఆయిల్ ఇండియా లిమిటెడ్ అందించిన ప్రాథమిక నివేదిక ప్రకారం.. సముద్ర గర్భంలో తవ్విన మూడు బావులలో, రెండు బావులలో హైడ్రోకార్బన్ల ఉనికి స్పష్టంగా ఉన్నట్లు తేలింది. ఈ నిక్షేపాల ద్వారా భవిష్యత్తులో వాణిజ్యపరంగా గ్యాస్, చమురు ఉత్పత్తిని భారీగా చేపట్టేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.







