India UK Critical Minerals Global Supply Chain Observatory | భారత్–యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) మధ్య క్రిటికల్ మినరల్స్ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం మరొక కీలక మైలురాయిని చేరుకుంది. 2025లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ గారి ద్వైపాక్షిక భేటీ సందర్భంగా క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో తాజాగా ఈ కేంద్రం అందుబాటులోకి వచ్చింది.
గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భారత్–యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లయ్ చైన్ అబ్జర్వేటరీ (GSCO) శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి గారు, యూకే ఫారిన్ సెక్రటరీ ఇవెట్ కూపర్ గారితో కలసి లాంఛనంగా ప్రారంభించారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముకగా మినరల్స్..
ఈ అంతర్జాతీయ కేంద్రం ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన, స్థిరమైన, విశ్వసనీయమైన క్రిటికల్ మినరల్స్ సప్లయ్ చైన్ వ్యవస్థ నిర్మాణంలో ఈ అబ్జర్వేటరీ కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
క్లీన్ ఎనర్జీ, ఆధునిక సాంకేతికతలు, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో క్రిటికల్ మినరల్స్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముకగా మారుతున్నాయన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద డిజిటల్ మెటీరియల్ ఫ్లో మ్యాప్ రూపకల్పనలో ఈ అబ్జర్వేటరీ ముఖ్య కేంద్రంగా నిలవనుందని స్పష్టం చేశారు.
వికసిత్ భారత్ – 4 బిలియన్ డాలర్ల జాతీయ మిషన్..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో క్రిటికల్ మినరల్స్ రంగంలో స్వావలంబనకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కిషన్ రెడ్డి వివరించారు.
ఈ క్లిష్టమైన లక్ష్యంతోనే దేశంలో 4 బిలియన్ డాలర్ల బడ్జెట్ తో ‘జాతీయ క్రిటికల్ మినరల్స్ మిషన్’ను ప్రారంభించినట్లు వెల్లడించారు. మినరల్స్ వెలికితీత, ఎక్స్‌ప్లొరేషన్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్, ఇన్నొవేషన్స్ వంటి విషయాల్లో వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశమన్నారు.
రీసైక్లింగ్ కోసం ప్రత్యేక నిధులు..
క్రిటికల్ మినరల్స్ రీసైక్లింగ్‌ను ప్రోత్సహించేందుకు 180 మిలియన్ డాలర్ల ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్నామని, దేశవ్యాప్తంగా తొమ్మిది సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. పారిశ్రామిక వ్యర్థాల నుంచి విలువైన మినరల్స్ సేకరించడం, విదేశాల్లో మినరల్స్‌ను తవ్వడం వంటి చర్యలు వేగవంతం చేశామన్నారు.
మినరల్స్ రంగంలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా ఈ-ఆక్షన్, ప్రైవేట్ కంపెనీలకు ప్రోత్సాహం, జూనియర్ మైనింగ్ కంపెనీలకు అవకాశాలు కల్పిస్తూ వేగంగా అనుమతులు ఇస్తోందన్నారు. పెట్టుబడులకు ప్రపంచంలోనే అత్యంత అనుకూలమైన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
బ్రిటిష్ పరిశ్రమలు, పెట్టుబడిదారులు భారత క్రిటికల్ మినరల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యూకేకు ఉన్న అడ్వాన్స్‌డ్ మినరల్ ప్రాసెసింగ్, ఎక్స్‌ట్రాక్షన్ టెక్నాలజీ భారతదేశంలోని ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), డిఫెన్స్, ఏరోస్పేస్, సెమీకండక్టర్ రంగాల వేగవంతమైన అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు.
భవిష్యత్తులో ఈ అబ్జర్వేటరీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘క్రిటికల్ మినరల్ ఇంటెలిజెన్స్ కేంద్రం’గా ఎదిగి పరిశ్రమలు, పరిశోధకులు, పెట్టుబడిదారులకు అత్యంత విలువైన సమాచారాన్ని అందిస్తుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్ర గనుల శాఖ, ఐఐటీ (ఐఎస్‌ఎం) ధన్‌బాద్, టెక్స్‌మిన్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలోని టెక్నాలజీ ట్రాన్స్‌లేషన్ రీసెర్చ్ పార్క్ మరియు యూకేకు చెందిన ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇందులో యూకే విదేశాంగ శాఖ ప్రతినిధులు, బ్రిటిష్ హై కమిషన్ అధికారులు, భారత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







