Chandrababu Naidu Comments On Pawan Kalyan Controversy | జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను తెలంగాణలో తిరగనివ్వబోమంటూ కొంతమంది నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు.
ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడైనా పర్యటించే, పోటీ చేసే హక్కు ఉంటుందని గుర్తుచేశారు. పొరుగు రాష్ట్ర నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు.
రాజకీయాల్లో నాయకులు ఇతర రాష్ట్రాల్లో పర్యటించడం సర్వసాధారణమైన విషయమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
“గతంలో నేను కూడా తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేశాను. మొన్నటికి మొన్న కర్ణాటకకు చెందిన డీకే శివకుమార్ సహా దేశంలోని ఎందరో ముఖ్య నేతలు ఇతర రాష్ట్రాల్లో పర్యటించారు, ప్రచారాలు చేశారు.
అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ (BRS) పార్టీని జాతీయ పార్టీ అని చెప్పి ఆంధ్రప్రదేశ్‌లోనూ విస్తరించారని, అక్కడ కూడా ఆ పార్టీ తరఫున నాయకులు పోటీ చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. అప్పుడు ఆంధ్రా ప్రజలు వారిని అడ్డుకోలేదని గుర్తు చేశారు.
ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు రాణిస్తున్నారని, అమెరికా లాంటి అగ్రరాజ్యంలో సైతం మనవాళ్లు వెళ్లి సెనేటర్స్ అవుతున్నారని కొనియాడారు.
రాజకీయాల్లో పోటీ అనేది ప్రజలకు ఎవరు మెరుగైన సేవ చేస్తారనే విషయంలో ఉండాలి కానీ.. ఇలాంటి ప్రాంతీయ విద్వేషాలు రేపే అంశాల్లో కాదని సీఎం చంద్రబాబు నాయుడు హితవు పలికారు.







