Wednesday 13th May 2026
12:07:03 PM
Home > తాజా > తెలంగాణలో పులుల సంరక్షణకు మరింత బలోపేతం!

తెలంగాణలో పులుల సంరక్షణకు మరింత బలోపేతం!

Tiger Conversation in TG

‌- టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

Tiger Conservation Telangana | తెలంగాణలో వన్యప్రాణుల సంరక్షణకు మరింత ప్రాధాన్యత ఇస్తూ, అమ్రాబాద్ మరియు కవ్వాల్ టైగర్ రిజర్వుల కోసం 2026-27 వార్షిక కార్యాచరణ ప్రణాళిక (APO) కు డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన జరిగిన టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ (TCF) పాలక మండలి ఆమోదం తెలిపింది..

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అడవుల అభివృద్ధి, అటవీ సంరక్షణ, పులుల సంఖ్య పర్యవేక్షణకు ఆధునిక పరికరాల వినియోగం, జీవ వైవిధ్య పరిరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు.

రిజర్వుల అడవుల భద్రత కోసం వాచర్ల వేతనాలు, అడవి మౌలిక సదుపాయాల నిర్వహణ వంటి అంశాలకు ప్రత్యేక నిధులు కేటాయించినట్లు వెల్లడించారు.

టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ పనుల్లో పారదర్శకత, సమర్థత ఉండేలా ప్రత్యేక విధానాలు అమలు చేయాలన్నారు..అడవుల్లో నివసించే గిరిజనుల భాగస్వామ్యంతో ఎకో టూరిజం, ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించిన కార్యక్రమాలు నామినేషన్ విధానంలో చేపట్టాలని నిర్ణయించారు .

అయితే భారీ మౌలిక వసతుల పనులు, అధిక విలువ కలిగిన పరికరాల కొనుగోళ్లు టెండర్ విధానంలోనే నిర్వహిచాలన్నారు..

వన్యప్రాణుల సంక్షేమంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. వేట, రోడ్డు ప్రమాదాలు లేదా ఇతర కారణాలతో గాయపడిన జంతువుల రక్షణ కోసం ప్రత్యేక రెస్క్యూ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు.

త్వరితగతిన స్పందించేలా ప్రత్యేక ట్రక్ మౌంటెడ్ రెస్క్యూ వాహనాలను వినియోగంలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. అడవిలోకి వెంటనే విడిచిపెట్టలేని జంతువుల పునరావాసం కోసం ప్రత్యేక సంరక్షణ కేంద్రాలు, ప్రే ఆగ్మెంటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

కవ్వాల్ టైగర్ రిజర్వ్ బఫర్ జోన్ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.

సంరక్షణ కార్యక్రమాలకు ఆర్థిక వనరులు సమకూర్చేందుకు రిజర్వ్ గుండా వెళ్లే వాహనాలపై టోల్ ఫీజులను సవరించాలని ప్రతిపాదించారు. బయటి ప్రాంతాల వాహనాలకు రూ.600, స్థానిక వాహనాలకు రాయితీగా రూ.300 టోల్ ఫీజు విధించాలని సూచించారు.

అడవులను సందర్శించే విద్యార్థులకు ప్రకృతి మధ్యలో నేర్చుకునే, ఆడుకునే ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని మంత్రి ఆదేశించారు.

అలాగే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని జలపాతాల ప్రాంతాల్లో ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక భద్రతా జోన్లు ఏర్పాటు చేసి స్పష్టమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.

ముఖ్యంగా పిల్లలు, పర్యాటకుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఎకో టూరిజాన్ని సురక్షితమైన, విద్యాపరమైన అనుభవంగా తీర్చిదిద్దాలని మంత్రి పేర్కొన్నారు.

ఈ సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, అటవీ దళాల అధిపతి డాక్టర్ సీ సువర్ణ,సీనియర్ అధికారులు శాంతారాం, రేవంత్ చంద్ర, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions