- మార్క్ శంకర్‌ను ఆలింగనం చేసుకున్న మోదీ
PM Modi Visit Pawan Kalyan Home | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసంలో ఆదివారం సాయంత్రం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా జూబ్లీహిల్స్ లోని పవన్ ఇంటికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులతో గడిపారు. రాజకీయాలకు అతీతంగా సాగిన ఈ భేటీలో ప్రధాని చూపిన ఆప్యాయత అందరినీ ఆకట్టుకుంది.
పవన్ ఆరోగ్యంపై ఆరా..
ఇటీవల పవన్ కళ్యాణ్ చేయించుకున్న ‘ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ’ గురించి ప్రధాని ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. సుదీర్ఘ రాజకీయ పర్యటనల్లో ధూళి వల్ల ఇన్ఫెక్షన్ సోకి, అది కంటిపై ప్రభావం చూపిన తీరును పవన్ వివరించారు. దీనిపై స్పందించిన మోదీ.. “ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు, సమాజానికి మీరు చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది” అని హితవు పలికారు.
మార్క్ శంకర్‌పై వాత్సల్యం..
సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌ను ప్రధాని దగ్గరకు తీసుకున్నారు. “నీ గురించి మేమంతా ఎంతో ఆందోళన పడ్డాం బాబూ” అంటూ ఆప్యాయంగా పలకరించారు. మార్క్ శంకర్ స్వయంగా తయారు చేసిన ‘వెల్కమ్’ కార్డును ప్రధానికి అందించాడు.
అకీరాతో చమత్కారం..
మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నానని చెప్పిన అకీరా నందన్‌తో మోదీ సరదాగా మాట్లాడారు. పవన్ వైపు చూస్తూ.. “ఇంట్లోనే ఒక మార్షల్ ఆర్ట్స్ స్టార్ (పవన్) ఉన్నారు.. నువ్వు కూడా అటువైపే వెళ్తున్నావా?” అని చమత్కరించారు.
ఆద్యతో హిందీలో.. అన్నా కొణిదెలతో రష్యన్‌లో..
పవన్ సతీమణి అన్నా కొణిదెలతో ప్రధాని కొన్ని రష్యన్ పదాలు మాట్లాడి ఆశ్చర్యపరిచారు. తన అమ్మమ్మ వైపు గుజరాతీ మూలాలు ఉన్నాయని చెప్పిన ఆద్యతో మోదీ హిందీలో ముచ్చటించారు.
హిందీ రాని చిన్న కుమార్తె పొలీనా అంజనాతో.. “వచ్చేసారి కలిసేటప్పటికి హిందీ నేర్చుకోవాలి” అని సరదాగా చెప్పారు. ప్రధాని మోదీ పర్యటనతో పవన్ కళ్యాణ్ నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది.
ఒక దేశ ప్రధాని ఇలా సామాన్య కుటుంబ సభ్యుడిలా కలిసిపోవడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.







