Thursday 23rd April 2026
12:07:03 PM
Home > తాజా > HYD చూసి మురిసిపోయిన ఆదివాసీలు.. మాట నిలబెట్టకున్న మంత్రి జూపల్లి!

HYD చూసి మురిసిపోయిన ఆదివాసీలు.. మాట నిలబెట్టకున్న మంత్రి జూపల్లి!

adivasi visit to hyderabad

Adivasi tribals’ Hyderabad visit | అడవి తల్లి ఒడిలో బతుకులీడ్చే ఆదివాసీల జీవితాల్లో నగరం ఒక కల. ఆ కలను నిజం చేసి, గిరిపుత్రుల కళ్లల్లో ఆనందాన్ని నింపారు తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి, ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు.

గత ఏడాది డిసెంబర్‌లో తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సుమారు 300 మంది ఆదివాసీ గిరిజన కుటుంబాలను ఆయన హైదరాబాద్‌కు రప్పించారు.

2025 డిసెంబర్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు ఒక సభలో ఆదివాసీలను ఉద్దేశించి మంత్రి.. “మీలో ఎంతమంది హైదరాబాద్ నగరాన్ని చూశారు?” అని ప్రశ్నించారు. ఆశ్చర్యకరంగా ఇద్దరు మినహా ఎవరూ చేయి ఎత్తలేదు.

స్వరాష్ట్ర రాజధానిని కూడా చూడని గిరిపుత్రుల పరిస్థితిని చూసి చలించిన మంత్రి, అప్పుడే వారికి ఒక మాట ఇచ్చారు. “మిమ్మల్ని అందరినీ నేను హైదరాబాద్ తీసుకుపోతా.. అక్కడ నగరం అంటే ఏంటో చూపిస్తా.. చదువు ప్రాముఖ్యత ఏంటో వివరిస్తా” అని హామీ ఇచ్చారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రత్యేక బస్సుల్లో గిరిజన కుటుంబాలను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.  శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ఆదివాసీలు, అక్కడ విమానాల రాకపోకలను చూసి అబ్బురపడ్డారు. చార్మినార్, గోల్కొండ కోట, ట్యాంకుబండ్ మరియు హుస్సేన్ సాగర్ వంటి పర్యాటక ప్రాంతాలను చూస్తూ వారు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఆదివాసీలకు నగర జీవన విధానంపై అవగాహన కల్పిస్తూ, వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు చదువు ఎంత అవసరమో మంత్రి స్వయంగా వివరించారు. అత్యంత వెనుకబడిన ప్రాంతాల నుండి వచ్చిన ఆదివాసీల పట్ల మంత్రి జూపల్లి చూపిన ఈ ప్రత్యేక చొరవపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ఒక ప్రజాప్రతినిధి తన మాటను నిలబెట్టుకోవడమే కాకుండా, వినూత్నమైన ‘రివర్స్ టూరిజం’ ద్వారా గిరిజనులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయడం గర్వకారణమని ప్రజలు కొనియాడుతున్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions