JD Vance praises In-Laws Family | అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వలసదారులు మరియు అమెరికా పౌరసత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జార్జియా యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తన భార్య ఉషా చిలుకూరి కుటుంబ సభ్యులను ఉదాహరణగా తీసుకుని వలసదారుల గొప్పతనాన్ని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన తెలుగు కుటుంబం నుండి వచ్చిన తన మామగారు, 1980ల్లోనే అమెరికాకు వలస వచ్చి ఇక్కడి పౌరసత్వం పొందారని వాన్స్ గుర్తు చేసుకున్నారు. “నా మామగారు ఎప్పుడూ అమెరికా ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతనిచ్చారు.
ఆయనను చూస్తుంటే నాకు గర్వంగా ఉంటుంది” అని పేర్కొన్నారు. వలసదారులు అమెరికాను సుసంపన్నం చేస్తున్నారని చెబుతూనే, ఇమిగ్రేషన్ వ్యవస్థలో కఠినమైన నియంత్రణ ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
భారత సంతతి వ్యక్తులు గ్రీన్ కార్డుల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అంశంపై వాన్స్ స్పందించారు. హెచ్-1బీ వీసా విధానంలో జరుగుతున్న మోసాలను అరికట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.
అమెరికా పౌరసత్వం అంటే కేవలం చట్టపరమైన పత్రం కాదని, అది ఈ దేశ ప్రయోజనాలకు కట్టుబడి ఉండటమని ఆయన ఉద్ఘాటించారు.
ఇరాన్ – పాక్ శాంతి చర్చలపై స్పందన..
అంతర్జాతీయ పరిణామాలపై మాట్లాడుతూ, ఇరాన్‌తో ఉన్న దశాబ్దాల నాటి అపనమ్మకం వెంటనే తొలగిపోదని, అయితే చర్చలకు ఆ దేశం ఆసక్తిగా ఉందని వెల్లడించారు.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో త్వరలో జరగనున్న శాంతి చర్చల ద్వారా సానుకూల ఫలితం వస్తుందని అమెరికా ఆశిస్తోంది. ఈ నెల 21న కాల్పుల విరమణ గడువు ముగియనుండటంతో, అంతలోపు ఒక శాశ్వత పరిష్కారం లభించేలా ట్రంప్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.






