Actor Counter To MLA Anirudh Reddy | టాలీవుడ్ డ్రగ్స్ అంశం మరోసారి రాజకీయ, సినీ వర్గాల మధ్య సెగలు రేపుతోంది.
సినీ నటులందరూ ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ తనదైన శైలిలో స్పందించారు.
ఎమ్మెల్యే విసిరిన సవాల్‌కు ప్రతి సవాల్ విసురుతూ.. నటులకు డ్రగ్స్ టెస్టులు చేస్తే, రాజకీయ నాయకులకు ‘లై డిటెక్టర్’ పరీక్షలు చేయాలని డిమాండ్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
మంగళవారం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. సినీ పరిశ్రమలోనే డ్రగ్స్ సంస్కృతి ఎక్కువగా ఉందనే ప్రచారం ఉందని వ్యాఖ్యానించారు. అగ్ర హీరోలతో పాటు నటీనటులందరూ స్వచ్ఛందంగా డ్రగ్స్ టెస్టులు చేయించుకుని అభిమానులకు ఆదర్శంగా నిలవాలని కోరారు.
ఒకవేళ పరీక్షలకు నిరాకరిస్తే వారు డ్రగ్స్ తీసుకున్నట్లేనని ప్రజలు భావించాల్సి ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, డ్రగ్స్ టెస్ట్ క్లియర్ చేసిన నటుల సినిమాలను మాత్రమే థియేటర్లలో విడుదల చేసేలా ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాలని ఆయన ప్రతిపాదించారు.
ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా స్పందించిన రాహుల్ రామకృష్ణ.. “నేను పెద్ద హీరోను కాకపోయినా టెస్టుకు రెడీ” అంటూ వ్యంగ్యంగా బదులిచ్చారు.
“వెంటనే దీనిపై జీవో జారీ చేయండి.. అందరం కలిసి చేద్దాం. అయితే మాకు డ్రగ్స్ టెస్టులు, మీకు (రాజకీయ నాయకులకు) లై డిటెక్టర్ టెస్టులు ఉండాలి. ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం పెట్టుకుందాం.. అప్పుడే మీ మాటలు, మా పనులు నమ్మి ప్రజలు అభివృద్ధి చెందుతారు” అంటూ రాహుల్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఎమ్మెల్యే వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమను కించపరిచేలా ఉన్నాయని కొందరు సినీ అభిమానులు మండిపడుతుంటే, రాహుల్ రామకృష్ణ ఇచ్చిన కౌంటర్ కు నెటిజన్ల నుంచి భారీ మద్దతు లభిస్తోంది.






