CM Revanth Speech In Assembly | తెలంగాణ శాసనసభలో వైద్య ఆరోగ్య శాఖపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ బకాయిలను పెండింగ్‌లో పెట్టి వ్యవస్థను కుప్పకూల్చిందని విమర్శిస్తూనే, తమ ప్రభుత్వం వచ్చాక చేసిన చెల్లింపులు మరియు రాబోయే సంస్కరణల గురించి వివరంగా వెల్లడించారు.
ఆరోగ్య శ్రీ బకాయిలపై స్పష్టత..
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఆరోగ్య శ్రీ కోసం ₹2408 కోట్లు చెల్లించినట్లు సీఎం తెలిపారు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులకు ₹927 కోట్లు, ప్రైవేట్ ఆసుపత్రులకు ₹1480 కోట్లు అందజేశామన్నారు.
గత ప్రభుత్వం వదిలివెళ్లిన భారీ బకాయిలను మోస్తూనే, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న మొత్తాన్ని కేవలం ₹727 కోట్లకు తగ్గించామని స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులు మూతపడుతున్నాయని జరుగుతున్న ప్రచారం తప్పు అని కొట్టిపారేశారు.
సీఎం రిలీఫ్ ఫండ్ లో అక్రమాలకు చెక్..
గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల విషయంలో అనేక అవకతవకలు జరిగాయని, వాటిపై కేసులు కూడా నమోదయ్యాయని సీఎం గుర్తు చేశారు. అక్రమాలకు తావులేకుండా ఇప్పుడు ఆన్‌లైన్ అప్లికేషన్ విధానాన్ని తెచ్చామన్నారు.
ఇప్పటివరకు CMRF కింద ₹2046 కోట్లు పంపిణీ చేశామని, ఆరోగ్య శ్రీతో కలిపి మొత్తం ₹4500 కోట్లు పేదల వైద్యం కోసం ఖర్చు చేశామని వెల్లడించారు.
వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు..
గోషామహల్‌లోని 30 ఎకరాల స్థలంలో ₹3000 కోట్లతో అత్యాధునిక ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించబోతున్నామని, అదనంగా 10 వేల బెడ్లు అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు.
వరంగల్, అల్వాల్, ఎల్‌బీ నగర్, సనత్ నగర్‌లోని టిమ్స్ ఆసుపత్రులను స్పెషలైజేషన్ సెంటర్లుగా మారుస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ జీవిత బీమా..
కులగణన ఆధారంగా రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా కల్పించి ప్రతి కుటుంబానికి ధీమా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. విదేశాల్లో ఉన్న తెలుగు డాక్టర్ల సేవలను వినియోగించుకోవడానికి ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నట్లు సీఎం వెల్లడించారు.
టీచింగ్ ఆసుపత్రుల నిర్వహణ బాధ్యతలను గ్రూప్-1 అధికారికి అప్పగించే ఆలోచన చేస్తున్నామన్నారు. ఆరోగ్య శ్రీ రోగులను ఈ కాలేజీలకు పంపడం ద్వారా అక్కడి వసతులను మెరుగుపరుస్తామని చెప్పారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారికి పేదల కష్టాలపై పూర్తి అవగాహన ఉందని, ఆయన ఆధ్వర్యంలో మరిన్ని సంస్కరణలు తెస్తామని ధీమా వ్యక్తం చేశారు.
“విద్య, వైద్యం మా ప్రభుత్వ ప్రాధాన్యతలు. పేదల వైద్యం కోసం ఒక్క రూపాయి కూడా కోత విధించం, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తాం” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.






