Gas Booking Rules | ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశంలో గ్యాస్ కొరత ఏర్పడుతుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ బుకింగ్ నిబంధనలు మారాయని, గడువులను పెంచారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది.
వైరల్ అవుతున్న ఫేక్ వార్త ఇదీ..
గ్యాస్ కొరత దృష్ట్యా ప్రభుత్వం కొత్త నిబంధనలు తెచ్చిందని, సింగిల్ సిలిండర్ ఉన్నవారు 25 రోజులకు, డబుల్ సిలిండర్ ఉన్నవారు 45 రోజులకు ఒకసారి మాత్రమే బుకింగ్ చేసుకోవాలని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీనివల్ల సామాన్య ప్రజలు ఆందోళనకు గురై పెద్ద ఎత్తున ‘పానిక్ బుకింగ్స్’ చేస్తున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన స్పష్టత..
గ్యాస్ బుకింగ్ నియమ నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని కేంద్రం తేల్చిచెప్పింది. ప్రస్తుతం అమలులో ఉన్న పాత గడువులే యథాతథంగా కొనసాగుతాయి.
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, పట్టణ ప్రాంతాల్లో సిలిండర్ డెలివరీ అయిన తర్వాత తదుపరి రీఫిల్ కోసం 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు బుకింగ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు.
ఆందోళన వద్దు..
దేశంలో గ్యాస్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుందని, సోషల్ మీడియాలో వచ్చే నిరాధారమైన వార్తలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.
అనవసరంగా ముందస్తు బుకింగ్స్ చేయడం వల్ల సరఫరా వ్యవస్థపై అనవసర ఒత్తిడి పెరుగుతుందని, కాబట్టి వినియోగదారులు సహకరించాలని ప్రభుత్వం కోరింది.






