- 26వ ఆల్ ఇండియా పోలీస్ టెన్నిస్ పోటీలను ప్రారంభించిన బండి సంజయ్!
Police Lawn Tennis | వేగవంతమైన నిర్ణయ సామర్థ్యం, ఏకాగ్రత మరియు రణతంత్ర ఆలోచనలు కలిగిన పోలీస్ అధికారి దేశానికి ఆస్తి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
న్యూఢిల్లీలోని ఆర్.కె.ఖన్నా స్టేడియంలో మంగళవారం ప్రారంభమైన ’26వ ఆల్ ఇండియా పోలీస్ లాన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్–2026’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, క్రీడలను అధికారికంగా ప్రారంభించారు.
“లాన్ టెన్నిస్ క్రీడ ఏకాగ్రతను, సమతుల్యతను పెంచుతుంది. ఒక ఉత్తమ పోలీస్ అధికారికి ఉండాల్సిన ప్రధాన లక్షణాలు ఇవే.
అంతర్గత భద్రత నుంచి సరిహద్దు రక్షణ వరకు సవాళ్లను ఎదుర్కొనే పోలీసులకు ఇటువంటి క్రీడలు శారీరక దృఢత్వాన్ని, మానసిక ధైర్యాన్ని (Mental Resilience) ఇస్తాయి” అని బండి సంజయ్ పేర్కొన్నారు.
ఈ ఛాంపియన్‌షిప్ కేవలం క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికే కాదని, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోలీస్ దళాల మధ్య సోదర భావాన్ని, జాతీయ ఐక్యతను పెంపొందించే వేదిక అని ఆయన కొనియాడారు.
ప్రధాని మోదీ గారి మార్గదర్శకత్వంలో ‘ఖేలో ఇండియా’, ‘ఫిట్ ఇండియా’ వంటి కార్యక్రమాల ద్వారా దేశంలో క్రీడల పట్ల ఆసక్తి పెరిగిందని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో పారా మిలటరీ దళాల్లో క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు.
హిమాలయ సరిహద్దుల్లో సేవలు అందిస్తున్న ఐటీబీపీ హిమవీరులు ఈసారి ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం సంతోషకరమని, వారు క్రీడల్లో కూడా అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని మంత్రి ప్రశంసించారు.






