Stampede in AP Temple | ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గలోని విజయవెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. కార్తీక మాసం, ఏకాదశి శనివారం కావడంతో వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది భక్తులు చనిపోయినట్లు తెలుస్తోంది. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం ఆలయంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏకాదశి కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా వచ్చారని స్థానికులు చెబుతున్నారు.
ఆలయంలో ఏర్పాటు చేసి క్యూలైన్లకు సంబంధించిన రెయిలింగ్ ఊడి, భక్తులు కిందపడిపోవడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. ఏకాదశి రోజు ఇంతమంది భక్తులు వస్తారని అంచనా వేయకపోవడంతోనే ఈ ఘటన జరిగిందంటున్నారు.
ఈ తొక్కిసలాట ఘటన కలచివేసిందని సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన కలచివేసిందనీ, ఈ ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయాల పాలైన వారికి మేలైన సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.






