KTR News Latest | తన జన్మదినం సందర్భంగా జులై 24న గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం చేపట్టనున్నట్లు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. జన్మదినం సందర్భంగా గత ఐదు సంవత్సరాలుగా చేపడుతున్న గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం తనకు అత్యంత సంతృప్తిని ఇచ్చిందని కేటీఆర్ చెప్పారు.
ఈసారి తన జన్మదినం సందర్భంగా గత సంవత్సర కాలంగా సిరిసిల్ల నియోజకవర్గంలో జన్మించిన 4910 మంది మాతృమూర్తులు, వారి శిశువులకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు.
తెలంగాణ ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేశారని, అందులో తనకు అత్యంత ఇష్టమైన కార్యక్రమం కేసీఆర్ కిట్ అని కేటీఆర్ అన్నారు.
మాత శిశు మరణాలను భారీగా తగ్గించి, తల్లికి శిశువుకు మంచి ఆరోగ్యాన్ని అందించే కేసీఆర్ కిట్‌ను ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని విమర్శించారు. అందుకే సిరిసిల్ల జిల్లాలో గత 18 నెలలుగా పుట్టిన ప్రతి ఒక్క శిశువుకు కేసీఆర్ కిట్‌ను అందిస్తానని కేటీఆర్ తెలిపారు.
తన పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఐదు సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలను చేపట్టామని కేటీఆర్ పేర్కొన్నారు.










