Monday 16th March 2026
12:07:03 PM
Home > తాజా > ‘వాళ్ల అసలు రంగు బయటపడింది’

‘వాళ్ల అసలు రంగు బయటపడింది’

kishan reddy slams tg assembly speaker

– డీలిమిటేషన్ పై అవన్నీ డీఎంకే, కాంగ్రెస్, బీఆర్ఎస్ దుష్ప్రచారం.

– వాళ్లవన్నీ అసత్యాలే.. ప్రజలు తిప్పికొట్టాలి

– లేని అంశాన్ని బూతద్దంలో చూపించి మభ్యపెడుతున్నారు

– ఇంకా జనాభా లెక్కల సేకరణే ప్రారంభం కాలేదు

– చెన్నైలో విపక్షాల సమావేశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు

డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అసలు రంగు బయటపడిందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సోమవారం ఆయన హైదరాబాద్ లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పై చెన్నైలో జరిగిన సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీపడి మాట్లాడటం, వారి నిజస్వరూపాన్ని బయటపెట్టిందన్నారు.

దేశంలో లేని సమస్యను సృష్టించి, భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు.

నియోజకవర్గాల పునర్విభజనపై ఇప్పటివరకు పార్లమెంటులో లేదా కేబినెట్‌లో ఎటువంటి చర్చ జరగలేదనీ, కానీ, అవకాశవాద పార్టీలు దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని తప్పుడు ప్రచారం చేస్తూ దిగజరారుడు రాజకీయాలకు తెరలేపుతున్నాయని విమర్శించారు.

“తమిళనాడులో డీఎంకే పాలనలో అవినీతి, కుంభకోణాల పాలన చేస్తూన్న స్టాలిన్ కుటుంబం పై ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకత కూడగట్టుకుంది. దక్షిణాది ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది. భవిష్యత్తులోనూ చేస్తుంది.

వచ్చే శాసనసభ ఎన్నికల్లో కర్ణాటకలో, తెలంగాణలో గెలిచేలా, తమిళనాడులో మరింత పట్టు సాధించేలా అంకితభావంతో పనిచేస్తున్నాం. అయితే, దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ బలపడకూడదనే రాజకీయ కుట్రకోణంతో కాంగ్రెస్ పార్టీ, డీఎంకే పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి.

జనాభా లెక్కల సేకరణ ఇంకా ప్రారంభం కాలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ అవకాశవాద పార్టీలు దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని తప్పుడు ప్రచారం చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి.

తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అవినీతి, కుంభకోణాలతో నిండిపోయింది. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను తప్పించుకోవడానికి, డీలిమిటేషన్ పేరుతో బీజేపీపై బురదజల్లే కుట్రలు చేస్తున్నారు.

గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని కారణంగా, ఇప్పుడు భాష, ప్రాంతం పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కర్ణాటక, తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి వస్తుంది. గత పార్లమెంటు ఎన్నికలతో పాటు, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రజలు బీజేపీకి మద్దతుగా తీర్పు ఇచ్చారు.

దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదన్న కుట్రతో కాంగ్రెస్, డీఎంకే, బీఆర్ఎస్ పార్టీలు కలిసి దుష్ప్రచారం చేస్తున్నాయి. దేశంలో కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాలకే పరిమితమైంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టబోతున్నారు.

కుటుంబ పార్టీలు, అసమర్థ పార్టీలు ముఠాగా ఏర్పడి, మోదీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఉన్నా వివక్ష లేకుండా అభివృద్ధి ఎజెండాతో ముందుకెళ్తున్న ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం.

గత పదిన్నరేళ్లుగా అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని దేశానికి అంకితభావంతో పని చేస్తున్నారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే విధంగా సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్నారు.

డీలిమిటేషన్‌పై అసత్య ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలి. డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం చేసేలా మోదీ ప్రభుత్వం పని చేస్తోంది.

కొన్ని కుటుంబ పార్టీలు, అవినీతి పాలిత పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. డీలిమిటేషన్ కు సంబంధించి ఏవైనా చట్టాలుంటే.. ఆ చట్టాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేసినవే. డీలిమిటేషన్ జరగాలంటే ముందుగా జనాభా లెక్కల సేకరణ జరగాలి.

పార్లమెంటులో చట్టం చేయాలంటే మేధావులు, రాష్ట్ర ప్రభుత్వాల సలహాలు తీసుకోవాలి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో ప్రజలకు ఏదో అన్యాయం జరుగబోతోందంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకే సమావేశం పాల్గొని ఆరోపణలు చేయడాన్ని మేం ఖండిస్తున్నాం. వారి ఆరోపణలన్నీ అసత్యాలే.

గత పదిన్నరేళ్లుగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు అంకితభావంతో పనిచేస్తున్నారు.  మోదీ గారు సబ్ కా సాథ్, సబ్ కా విశ్వాస్ అనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే విధంగా సమర్థవంతమైన పరిపాలనతో దేశ గౌరవాన్ని, అభివృద్ధిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టిపెడితే బాగుంటుంది. అంతేకాని కేంద్రంపై డీలిమిటేషన్ పేరుతో విమర్శలు చేయడం తగదు. విమర్శలు చేసినంత మాత్రాన ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి పోదనేది గుర్తుంచుకోవాలి.

చెన్నైలో జరిగిన డీలిమిటేషన్ మీటింగ్ లో ఆయా రాజకీయ పార్టీలు తమ స్వప్రయోజనాల కోసం, తమ అస్థిత్వం కోసం లేని అంశాన్ని బూతద్ధంలో చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాయి.

గత పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీతో పాటు మరికొన్ని రాజకీయ పార్టీలు బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి. ఎన్నికలవ్వగానే కొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తున్నాయి.

దక్షిణాది ప్రజలు, తెలుగు ప్రజలకు విన్నవిస్తున్నాం. డీలిమిటేషన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ఆలోచన చేయలేదు. ఏ ప్రాంతానికి కూడా అన్యాయం జరగకుండా అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేసేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తోంది.

కొన్ని కుటుంబ పార్టీలు, కుంభకోణాల పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలి.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య సయోధ్య చేసేందుకు మజ్లిస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీలు ఒక్కటైనా తెలంగాణ ప్రజల మద్దతుతో ఆ మూడు పార్టీలను సమర్థవంతంగా బిజెపి ఎదుర్కొంటుంది.

జనాభా లెక్కల సేకరణ చేయాలంటేనే కనీసం సంవత్సరం సమయం తీసుకుంటుంది. ఆ తర్వాత పార్లమెంటులో చర్చకు వస్తుంది.

కేవలం తమిళనాడులో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ స్టాలిన్ ను ముందుపెట్టి నాటకమాడుతోంది. ఆ నాటకంలో కేటీఆర్ భాగస్వామ్యమయ్యారు.

కేవలం బిజెపి మరింత బలపడకుండా ప్రజల్లో తప్పుడు సంకేతాలను పంపేందుకే ఆయా పార్టీలు నాటకమాడుతున్నాయి” అని విమర్శించారు కిషన్ రెడ్డి.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions