Wednesday 1st July 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > “ఎన్టీఆర్ ని కూడా రౌడీషీటర్ అనేవారేమో!”

“ఎన్టీఆర్ ని కూడా రౌడీషీటర్ అనేవారేమో!”

  • చంద్రబాబుపై వైఎస్ జగన్ నిప్పులు

YS Jagan Fires On Chandra Babu | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిందని, శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన మండిపడ్డారు.

బుధవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో జగన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై విస్మయం వ్యక్తం చేశారు.

బీహార్ కాదు.. ఏపీలోనే ‘జంగిల్ రాజ్’..

రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్నది రాజ్యాంగబద్ధమైన పాలన కాదని, అరాచక పాలన అంటూ జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘రూల్ ఆఫ్ లా’ (చట్టబద్ధమైన పాలన) పూర్తిగా అంతరించిపోయిందని, దాని స్థానంలో ‘రూల్ ఆఫ్ ఫియర్’ (భయానక పాలన) రాజ్యమేలుతోందని ఆయన దుయ్యబట్టారు.

18 నెలల అరాచకం..

గత 18 నెలలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచకాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని, జంగిల్ రాజ్ అంటే ఎక్కడో బీహార్‌లో లేదని, అది నేడు చంద్రబాబు పాలన రూపంలో ఏపీలోనే కనిపిస్తోందని ఆరోపించారు.

చంద్రబాబు ప్రభుత్వంలో తీవ్ర అన్యాయానికి గురైన బాధితులనే తిరిగి నిందితులుగా మార్చే దారుణమైన ప్రయత్నం జరుగుతోందని జగన్ విమర్శించారు.

ప్రశ్నిస్తే ‘రౌడీషీటర్’ ముద్ర..

కూటమి సర్కార్ పాలనలో సామాన్యుడి నుండి రాజకీయ నాయకుల వరకు ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను, అక్రమాలను ప్రశ్నిస్తే చాలు.. వారిపై తప్పుడు కేసులు పెట్టి ‘రౌడీషీటర్’ అనే ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ఒకవేళ దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) గారు ఈరోజు బ్రతికి ఉండి, చంద్రబాబు చేస్తున్న అరాచకాలను ప్రశ్నించి ఉంటే.. ఆయన్ను కూడా చంద్రబాబు రౌడీషీటర్ అనేవారేమో!”  అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.

సినిమాల్లో ఉండే విలన్లు నిజ జీవితంలో ఉండరని అనుకుంటారని, కానీ నిజమైన విలన్ చంద్రబాబు రూపంలోనే సమాజంలో ఉన్నారంటూ జగన్ మండిపడ్డారు.

రాష్ట్రంలో వైస్సార్సీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను తాము చట్టపరంగా, రాజకీయంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions