Chiranjeevi Tweet On Yoga Day | ఏపీ ప్రభుత్వం (AP Government) విశాఖపట్నంలో ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Yoga Day) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
అందులో భాగంగానే ‘యోగాంధ్ర-2025’ పేరుతో మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మాసంగా ప్రకటించారు. ఈ సందర్భంగా టాలీవుడ్ నటుడు, మెగస్టార్ చిరంజీవి తన ఎక్స్ ఖాతా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. యోగాను ప్రపంచానికి భారత్ ఇచ్చిన బహుమతిగా అభివర్ణించారు. యోగాతో ఫోకస్, ఫిట్నెస్ రెండూ వస్తాయని పేర్కొన్నారు.
లోతుగా ఊపిరి పీల్చుకుందాం, పైకి ఎదుగుదాం.. జూన్ 21న యోగా దినోత్సవాన్ని కలిసి సెలబ్రేట్ చేసుకుందామని పోస్ట్ చేశారు. కాగా, ఏపీ ప్రభుత్వం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణతో సరికొత్త రికార్డు సృష్టించేలా ప్లాన్ చేసింది.
యోగా దినోత్సవం నాడు దాదాపు 5 లక్షల మందితో విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి శ్రీకాకుళం బీచ్ వరకు అనుకూల ప్రాంతాలన్నింట్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆర్కే బీచ్లో ప్రధాని నరేంద్ర మోదీ హజరవనున్నారు. విశాఖపట్నంలో సుమారు 2.5 లక్షల మంది యోగాలో పాల్గొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.