Manchu Manoj Pressmeet | మంచు కుటుంబంలో ఎప్పుడు ఏం జరిగినా అది సోషల్ మీడియాలో సంచలనమే. తాజాగా మంచు వారసుడు, రాకింగ్ స్టార్ మంచు మనోజ్ తన తండ్రి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కోపాన్ని ఉద్దేశించి చేసిన ఫన్నీ కామెంట్స్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
మే 20న (బుధవారం) తన పుట్టినరోజును పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన మనోజ్.. తన కొత్త సేవా సంస్థ, సినిమాలు, కుటుంబ విషయాలతో పాటు భార్య భూమా మౌనిక రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మైక్ వద్దు.. హెల్మెట్ మస్ట్..
ప్రెస్‌మీట్‌లో ఒక విలేకరి స్పందిస్తూ.. “గత కొంతకాలంగా మీ తండ్రి మోహన్ బాబు గారితో ఉన్న విభేదాలు ఇప్పుడు సద్దుమణిగాయా?” అని ప్రశ్నించారు. దీనికి మనోజ్ తనదైన శైలిలో నవ్వుతూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.
“ఈ ప్రశ్న నన్ను కాదు.. ఎవరిని అడగాలో మీకు బాగా తెలుసు. కానీ ఆయన దగ్గరికి మాత్రం మైక్ పట్టుకుని వెళ్ళకండి. ఒకవేళ అంతగా వెళ్లాల్సి వస్తే కచ్చితంగా హెల్మెట్ ధరించి వెళ్ళండి” అంటూ మనోజ్ సరదాగా వ్యాఖ్యానించారు.
గతంలో మంచు ఫ్యామిలీలో గొడవలు జరిగిన తరుణంలో, ప్రెస్‌మీట్‌లో ప్రశ్నించిన ఒక విలేకరిపై మోహన్ బాబు మైక్ విసిరి కొట్టడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఇప్పుడు సొంత కొడుకే ఆ సీన్‌ను గుర్తుచేస్తూ జర్నలిస్టులపై పంచ్ వేయడంతో అక్కడున్న వారంతా నవ్వు ఆపుకోలేకపోయారు.
భార్య మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఖాయం..
ఈ సందర్భంగా మనోజ్ తన భార్య, దివంగత నేతలు భూమా నాగిరెడ్డి-శోభా నాగిరెడ్డిల కుమార్తె భూమా మౌనిక రెడ్డి రాజకీయ ప్రవేశంపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మౌనిక కచ్చితంగా పోటీ చేస్తుందని మనోజ్ అధికారికంగా ప్రకటించారు.
రాజకీయాలకు అతీతంగా ‘ఐక్య ధైర్యసేన సమితి’..
తన పుట్టినరోజు సందర్భంగా మంగళవారం మనోజ్ సరికొత్తగా ‘ఐక్య ధైర్యసేన సమితి’ అనే సేవా సంస్థను స్థాపించారు. దీనిపై వస్తున్న పొలిటికల్ రూమర్లకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు.
సొంత నిధులే పెట్టుబడి..
ఈ ‘ఐక్య’ సంస్థకు ఎలాంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, ఇది కేవలం ప్రజాసేవ కోసమే పెట్టామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని నిరుపేదలకు సాయం చేయడానికి తన సొంత నిధులనే ఉపయోగించబోతున్నట్లు మనోజ్ వెల్లడించారు.







