Bill On Online Games | దేశంలో ఆన్‌లైన్ మనీ గేమింగ్‌కు (Online money Games) ఫుల్ స్టాప్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. డబ్బుతో ఆడే అన్ని రకాల ఆన్‌లైన్ గేమ్‌లను నిషేధించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త బిల్లును రూపొందించింది.
ఆన్లైన్ గేమింగ్ నిర్వహణను నేరంగా పరిగణించే ‘ఆన్లైన్ గేమింగ్ బిల్లు’ను కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదించింది. దీనిని బుధవారం పార్లమెంటులో ప్రవేశపెడతారు.
ఇది ఆమోదం పొంది చట్టం గా మారితే ఆన్‌లైన్ రమ్మీ లాంటి గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు నిషేధానికి గురయ్యే అవకాశం ఉంది. అయితే, ఆన్లైన్ గేమ్స్, ఈ-స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేలా బిల్లును రూపొందించారు.
నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్నవారికి మూడేళ్ల వరకు జైలుశిక్ష, లేదా రూ.కోటి వరకు జరిమానా, లేదా ఆ రెండూ విధించాలని బిల్లులో ప్రతిపాదించారు.
ఆన్ లైన్ గేమ్ అడ్వర్టయిజ్మెంట్లలో భాగం పంచుకున్నవారికి గరిష్ఠంగా రెండేళ్ల జైలుశిక్ష, రూ. 50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వీటి ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్నవారికీ గరిష్ఠంగా మూడేళ్ల శిక్ష, రూ.కోటి వరకు జరిమానా వేస్తారు.











