- హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ హెచ్చరిక
Auto Execution File Attack WhatsApp Fraud | సైబర్ నేరగాళ్లు సాంకేతికతను ఆసరాగా చేసుకుని నిత్యం కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నారు. ఇప్పటివరకు గుర్తుతెలియని లింక్‌లపై క్లిక్ చేస్తేనో లేదా ఓటీపీలు పంచుకుంటేనో ఖాతాల్లో సొమ్ము మాయమయ్యేది.
కానీ, ఇప్పుడు ఎలాంటి ఓటీపీలు, లింకులతో పనిలేకుండా.. వాట్సాప్‌కు వచ్చే మెసేజ్‌కి కేవలం ‘నో’ (NO) అని రిప్లై ఇచ్చినంత మాత్రానికే ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ హెచ్చరించారు. ఈ కొత్త తరహా ‘ఆటో ఎగ్జిక్యూషన్ ఫైల్ అటాక్’ (Auto Execution File Attack) సైబర్ నేరంపై పౌరులంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఫేక్ డెబిట్ అలర్ట్.. కేటుగాళ్ల ప్లాన్ ఇదే..
మొదట అంతర్జాతీయ లేదా గుర్తుతెలియని నంబర్ల నుంచి బాధితుల వాట్సాప్‌కు ‘మీ బ్యాంక్ ఖాతా నుంచి కొంత నగదు డెబిట్ అయింది’ అని మెసేజ్ పంపుతారు. ఆ వెంటనే ‘ఈ లావాదేవీ మీరు చేయకపోతే వెంటనే నో (NO) అని రిప్లై ఇవ్వండి’ అంటూ రెండో సందేశం పంపిస్తారు. అకౌంట్ నుంచి డబ్బులు పోయాయన్న కంగారులో బాధితులు ‘NO’ అని టైప్ చేసి పంపగానే.. ఆ మెసేజ్‌లో దాగి ఉండే మాల్‌వేర్ స్క్రిప్ట్‌లు/హిడెన్ లింక్స్ స్వయంచాలకంగా యాక్టివేట్ అవుతాయి. దీంతో బాధితుల మొబైల్ ఫోన్‌పై హ్యాకర్లకు పూర్తి నియంత్రణ లభించి, క్షణాల్లో ఖాతాలోని సొమ్మంతా మాయమవుతుంది.
లక్షల్లో నష్టపోయిన సీఏ..
ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఒక చార్టర్డ్ అకౌంటెంట్ (CA) ఈ తరహా సైబర్ దాడిలోనే లక్షలాది రూపాయలు నష్టపోయారని సీపీ వెల్లడించారు.
సైబర్ దాడి నుంచి తపించుకోవడానికి సీపీ సజ్జనర్ సూచనలు:
- రిప్లై ఇవ్వకండి: వాట్సాప్‌లో బ్యాంక్ లావాదేవీల పేరుతో వచ్చే మెసేజ్‌లకు ‘YES’ గానీ, ‘NO’ గానీ ఎలాంటి రిప్లైలు ఇవ్వకూడదు. వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేసి మెసేజ్‌ను డిలీట్ చేయాలి.
- స్వయంగా తనిఖీ చేసుకోండి: నగదు కట్ అయిందనే సందేశం రాగానే భయపడకుండా.. నేరుగా మీ బ్యాంకింగ్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ అయి స్టేట్‌మెంట్ చూడండి.
- వాట్సాప్‌లో బ్యాంకులు అడగవు: ఏ అధికారిక బ్యాంక్ కూడా వాట్సాప్‌లో కస్టమర్ల నుంచి ‘YES’ లేదా ‘NO’ వంటి సమాధానాలను కోరదని గుర్తుంచుకోండి.
- గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు చేయండి: ఒకవేళ మోసపోయినట్లయితే వెంటనే జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేయాలి లేదా
cybercrime.gov.inపోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. నేరం జరిగిన మొదటి గంట (Golden Hour) లో ఫిర్యాదు చేస్తే నగదును హోల్డ్‌లో పెట్టి రక్షించే అవకాశం ఉంటుంది.











