Friday 9th October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఎలోన్ మస్క్ ‘స్టార్‌లింక్’ వివాదంలో దూరి అడ్డంగా బుక్కైన కాంగ్రెస్!

ఎలోన్ మస్క్ ‘స్టార్‌లింక్’ వివాదంలో దూరి అడ్డంగా బుక్కైన కాంగ్రెస్!

Rahul Gandhi on Women's Reservation Bill 2026

Rahul Gandhi Elon Musk Starlink Controversy కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసనలతో గత మూడు రోజులుగా దేశ రాజకీయాల్లో తనదే పైచేయిగా నిలుస్తూ వచ్చిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఒక్క సోషల్ మీడియా పోస్టుతో ఆ రాజకీయ మైలేజీని చేతులారా పోగొట్టుకున్నారు.

స్పేస్‌ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్ (Elon Musk) భారత శాటిలైట్ బ్రాడ్‌బాండ్ సర్వీస్ ‘స్టార్‌లింక్’ (Starlink) అనుమతుల ఆలస్యంపై కేంద్ర ప్రభుత్వం మరియు పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలలో రాహుల్ గాంధీ కల్పించుకోవడమే ఇప్పుడు బిజెపికి పెద్ద ఆయుధంగా మారింది.

ఎలోన్ మస్క్ సంచలన ట్వీట్..

భారత్‌లో స్టార్‌లింక్ సర్వీసుల వాణిజ్య రంగానికి అనుమతులు రావడంలో ఆలస్యం కావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎలోన్ మస్క్, నేరుగా రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

“ప్రపంచవ్యాప్తంగా 165కి పైగా దేశాల్లో స్టార్‌లింక్‌కు లైసెన్స్ ఉంది. భారతదేశంలో ప్రవేశించేందుకు దాదాపు ఐదేళ్ల పాటు ఇక్కడి చట్టాలన్నింటినీ పాటిస్తున్నాం. అయినా ఇంకా లైసెన్స్ ఎందుకు ఇవ్వడం లేదు? నిజానికి భారతదేశానికి అంబానీనే అసలైన బాసా?” అని మస్క్ ‘X’ (ట్విట్టర్) వేదికగా ప్రశ్నించారు.

అయితే, కేవలం స్టార్‌లింక్ మాత్రమే కాకుండా రిలయన్స్ జీవో శాటిలైట్ (Jio Satellite), భారతి గ్రూప్ మద్దతు ఉన్న యూటోల్‌శాట్ వన్-వెబ్‌లకు కూడా కేంద్ర హోంశాఖ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్ (భద్రతా అనుమతులు) పెండింగ్‌లోనే ఉన్నాయనే విషయాన్ని మస్క్ పక్కనబెట్టారు.

రాహుల్ గాంధీ ఎంట్రీ.. రివర్స్ అటాక్..

మోదీ ప్రభుత్వంపై ‘క్రోనీ క్యాపిటలిజం’ (వ్యాపారవేత్తలకు కొమ్ముకాయడం) ఆరోపణలను మరింత బలోపేతం చేసే క్రమంలో రాహుల్ గాంధీ మస్క్ ట్వీట్‌కు స్పందిస్తూ “భారత్‌కు స్వాగతం ఎలోన్.. ఇక్కడ ఉన్న ఇంకో వ్యక్తి గురించి మీకు తెలిసే వరకు వేచి చూడండి” (“Welcome to India, Elon. Wait till you discover the other guy”) అని సార్కాస్టిక్‌గా కామెంట్ చేశారు. దానికి మస్క్ “ధన్యవాదాలు రాహుల్.. ఇది నిజంగా ఆందోళనకరమైన విషయం” అని బదులిచ్చారు.

అయితే, జాతీయ భద్రత (National Security)తో ముడిపడి ఉన్న ఈ అంశంలోకి రాహుల్ గాంధీ ప్రవేశించడంపై అధికార బిజెపి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

కాంగ్రెస్ ద్వంద్వ నీతి బట్టబయలు: బిజెపి కౌంటర్

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బిజెపి నేతలు, కేంద్ర మంత్రులు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వైఖరిలోని ద్వంద్వ నీతిని ఎండగట్టారు. 2025 మరియు 2026 ప్రారంభంలో స్టార్‌లింక్ భారత్‌లోకి రావడంపై జాతీయ భద్రతా కారణాలు చూపుతూ తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అదే విదేశీ బిలియనీర్‌కు మద్దతుగా నిలవడంపై ప్రశ్నలు గుప్పించారు.

కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమర్శలు..

“కాంగ్రెస్ నాయకులకు ఎటు వెళ్లాలో తెలియడం లేదు. గతంలో ఒక వ్యక్తికి లైసెన్స్ ఇవ్వడాన్ని వ్యతిరేకించారు, ఇప్పుడు అదే వ్యక్తికి లైసెన్స్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు” అని ఎద్దేవా చేశారు.బిజెపి ఎంపీ తేజస్వి సూర్య రాహుల్ గాంధీని ‘జైచంద్’తో పోలుస్తూ.. “దేశ భద్రతను పక్కనబెట్టి కేవలం మోదీని వ్యతిరేకించడం కోసం విదేశీ వ్యాపారవేత్తలకు సపోర్ట్ చేస్తున్నారు” అని మండిపడ్డారు.

రక్షణ శాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ప్రాధాన్యత..

అండమాన్ నికోబార్ దీవులలో మరియు మణిపూర్ లోయలో తిరుగుబాటుదారుల వద్ద స్టార్‌లింక్ పరికరాలు లభించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శాటిలైట్ సేవలకు అనుమతులు ఇచ్చేముందు హోంశాఖ రక్షణ తనిఖీలను అత్యంత కీలకంగా భావిస్తోంది. దేశ భద్రత విషయంలో ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేసింది.

మొత్తానికి ఎన్నికల సంఘంపై ఈసీఐ వివాదంతో మోదీ ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేసిన రాహుల్ గాంధీ, మస్క్-స్టార్‌లింక్ అంశంలో జోక్యం చేసుకుని బిజెపికి తిరుగులేని కౌంటర్ అటాక్ చేసే అవకాశాన్ని చేతులారా ఇచ్చినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

You may also like
ఎన్నికల సంఘంపై దాడి ప్రజాస్వామ్యానికే ప్రమాదం!
‘సత్యాగ్రహ’ డిజిటల్ వేదికను ప్రారంభించిన రాహుల్ గాంధీ!
“డజన్ మంది ఎమ్మెల్యేలకు ఇద్దరు భార్యలు”: సీఎం డీకే కామెంట్స్!
దేశం మీకేం చేసింది కాదు.. మీరేం చేస్తారో ఆలోచించండి: నిర్మలా సీతారామన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions