Sangameshwara Temple నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల సమీపంలోని చారిత్రక సంగమేశ్వర ఆలయం వద్ద ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. పాతికేళ్ల (25 ఏళ్ల) సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారిగా వర్షాకాలంలో ఈ పురాతన క్షేత్ర శిఖరాలు నీటి పైకి దర్శనమిస్తున్నాయి.
శ్రీశైలం జలాశయం పరిధిలో ఉండే ఈ ఆలయం ఏడాదిలో దాదాపు 8 నెలల పాటు కృష్ణా నది నీటిలోనే మునిగి ఉంటుంది. శ్రీశైలం బ్యాక్‌వాటర్స్ క్రమంగా తగ్గుతుండటంతో కృష్ణా నది అలల నడుమ నుంచి సంగమేశ్వర క్షేత్ర గోపురాలు, శిఖరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పాతికేళ్ల తర్వాత తొలిసారి..
సాధారణంగా కేవలం వేసవి కాలంలో నీటిమట్టం బాగా పడిపోయినప్పుడు మాత్రమే బయటపడే ఈ ఆలయం, దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఇలా వర్షాకాలంలో బయటికి కనిపించడం పట్ల స్థానికులు, భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా నది ఒడ్డున ఈ అరుదైన దృశ్యాన్ని తిలకించేందుకు సమీప గ్రామాల ప్రజలతో పాటు భక్తులు సోమశిల తీరానికి తరలివస్తున్నారు.











