PM Modi Visits Vinayaka Temple ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని తమ రాజకీయ ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయిని చేరుకున్నారు. 2001 అక్టోబర్ 7న తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆయన, మే 2014 నుండి నేటి వరకు భారత ప్రధాన మంత్రిగా నిరంతరాయంగా సేవలు అందించారు. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రధాని మోదీ ఢిల్లీలోని సరోజినీ నగర్లో ఉన్న ప్రముఖ శ్రీ వినాయక ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేశ శ్రేయస్సు కోసం ప్రార్థన..
దేశంలో ఉన్న తన ‘కుటుంబ సభ్యుల’ అందరి సుఖసంతోషాలు, శ్రేయస్సు మరియు ఉత్తమ ఆరోగ్యం కోసం గణేశుడిని ప్రార్థించినట్లు ప్రధాని మోదీ అన్నారు. విఘ్నహర్త అనుగ్రహంతో భారత్ నిరంతరం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆశీస్సులు కోరారు. 25 ఏళ్ల పాలనా ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ సేవకు మళ్లీ పునరంకితమవుతున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు.
సరోజినీ నగర్ శ్రీ వినాయక ఆలయ ప్రత్యేకతలు..
1950ల కాలంలో ఢిల్లీలోని దక్షిణ భారతీయ సమాజం సంప్రదాయ పూజలు నిర్వహించడానికి ఈ ఆలయ ఆలోచన రూపుదిద్దుకుంది. 1953లో ‘శ్రీ వినాయక మందిర కమిటీ’ నమోదైంది. 1961 ఆగస్టు 24న అప్పటి వినయ్ నగర్ (ప్రస్తుత సరోజినీ నగర్)లో ‘శ్రీ సిద్ధి బుద్ధి సమేత కర్పగ వినాయక’ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1983లో శివునికి ప్రత్యేక ఆలయాన్ని నిర్మించి, నర్మదా నది నుండి తెచ్చిన ‘ఓంకారేశ్వర’ స్వయంభూ లింగాన్ని ప్రతిష్ఠించారు.
ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు వేద తరగతులు, మహారుద్రం, అతిరుద్రం వంటి వైదిక క్రతువులు జరుగుతాయి. రాత్రి వేళల్లో గర్భాలయం మూసివేసే ముందు ‘స్వపగీతం’ పఠించడం ఇక్కడి విశిష్ట సంప్రదాయం.











