CM Revanth Reddy Karimnagar Collectorate | కరీంనగర్ నూతన కలెక్టరేట్ భవన సముదాయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.
ప్రజలకు సేవలు అందించే ఉద్యోగులకు మౌలిక వసతులు కల్పించడానికే ఈ భవనాన్ని నిర్మించామని చెప్పారు. ఈ భవనం పేదవారికి ఒక నమ్మకాన్ని కల్పించాలని సీఎం పిలుపునిచ్చారు. పేదల సమస్యల చిక్కుముడులు విప్పడానికి కార్యాలయం ఉపయోగపడాలని స్పష్టం చేశారు.
ఉద్యోగులే సంక్షేమ వాహకులు..
ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలకు చేరవేసే అసలైన ప్రతినిధులు ఉద్యోగులేనని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సహాయం కోసం వచ్చే నిస్సహాయులలో మన కుటుంబ సభ్యులను చూసుకున్నప్పుడే నూటికి నూరు శాతం న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. సీఎం లేదా ప్రధానికి మంచి పేరు రావాలన్నా ఉద్యోగుల కష్టం మరియు సహకారం ఎంతో అవసరమని గుర్తుచేశారు.
కేంద్రంతో ‘ఇచ్చి పుచ్చుకునే’ ధోరణి..
రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ముందుకు వెళ్తామని సీఎం స్పష్టం చేశారు. సిద్ధాంతాలు వేరైనా అభివృద్ధి కోసం సహకరించుకుంటామని చెప్పారు. సమస్యల పరిష్కారానికి ఎన్నిసార్లైనా కేంద్రాన్ని కలవాల్సిందేనని తేల్చిచెప్పారు. ఆరు నెలల్లోనే 170 ఎకరాల డిఫెన్స్ భూములను రాష్ట్రానికి బదిలీ చేయించామని, బేగంపేట రన్వే కింద రోడ్డు నిర్మాణానికి అనుమతులు సాధించామని తెలిపారు.











