Supreme Court On Pending Traffic Challan దేశంలో రోజురోజుకీ పేరుకుపోతున్న పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కేవలం ఈ-చలాన్లు (e-challans) జారీ చేయడం మాత్రమే సరిపోదని, వాటిని వసూలు చేయడానికి క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మాట్లాడూతూ.. ఒకవేళ వాహనదారులు ట్రాఫిక్ చలాన్లు చెల్లించకపోతే, వాటిని కరెంట్ బిల్లులకు (Electricity Bills) అనుసంధానించి వసూలు చేసే మార్గాలను పరిశీలించాలని ఒక వినూత్న సలహాను ఇచ్చింది.
విద్యుత్ బిల్లులతో కనెక్షన్..
“ప్రజలు ట్రాఫిక్ చలాన్లు చెల్లించకపోతే, ఆ మొత్తాన్ని వారి విద్యుత్ బిల్లులకు జోడించండి. కరెంట్ కట్ అవుతుందనే భయంతోనైనా బిల్లు కడతారు. ఈ దేశంలో ఏదో ఒక మార్గం వెతకాల్సిందే” అని జస్టిస్ పార్డీవాలా వ్యాఖ్యానించారు (అయితే ఇది కేవలం పరిశీలనాత్మక సలహా మాత్రమేనని, తీర్పు కాదని కోర్టు స్పష్టం చేసింది).
రూ. 45,000 కోట్ల పెండింగ్ బాకీలు..
దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో దాదాపు రూ. 45,000 కోట్ల విలువైన ఈ-చలాన్ల బాకీలు పెండింగ్‌లో ఉన్నాయని, అందులో ఇప్పటివరకు కేవలం రూ. 25,000 కోట్లు మాత్రమే వసూలయ్యాయని కోర్టుకు నివేదించారు. పోలీసులు లక్షలాది ఈ-చలాన్లు జారీ చేస్తున్నప్పటికీ, అసలు సమస్య ఆ జరిమానాలను వసూలు చేయడంలోనే ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.
పెండింగ్ చలాన్ల వసూళ్లకు సుప్రీంకోర్టు సూచించిన కఠిన ప్రతిపాదనలు..
ఆర్సీ (RC) పునరుద్ధరణ నిలిపివేత..
పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) రెన్యూవల్, డూప్లికేట్ RC జారీ, అలాగే వాహన యాజమాన్య బదిలీ (Ownership Transfer)లను నిలిపివేయడం.
పరివాహన్ పోర్టల్‌లో బ్లాక్‌లిస్ట్..
ఫైన్లు కట్టే వరకు వాహనానికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం, పరివాహన్ (Parivahan) పోర్టల్‌లో ఆ వాహనాలను బ్లాక్‌లిస్ట్ చేయడం.
లైసెన్స్ & పీయూసీ సేవలు నిలిపివేత..
సదరు డ్రైవింగ్ లైసెన్సుల రెన్యూవల్ లేదా సస్పెన్షన్ చేయడంతో పాటు, ఆ వాహనాలకు పొల్యూషన్ (PUC) సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకోవడం.
వాహనాల సీజ్..
క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు (Random Checks) నిర్వహించి, ఎక్కువ పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాలను అవసరమైతే జప్తు (Seize) చేయడం.









