- వైస్ ప్రెసిడెంట్‌గా స్వతంత్ర అభ్యర్థి గెలుపు!
DUSU Election Results 2026 దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) 2026 ఎన్నికల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. అత్యంత హోరాహోరీగా సాగిన ఈ పోరులో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP)కు చెందిన యశ్ దాబాస్ అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్నారు. ఉపముఖ్యమైన ఉపాధ్యక్ష (వైస్ ప్రెసిడెంట్) పదవిని స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకీన్ గెలుచుకుని సంచలనం సృష్టించారు.
మిగిలిన స్థానాల్లో ఏబీవీపీకి చెందిన రియా ఛావడీ సెక్రటరీగా, లక్ష్య రాజ్ సింగ్ జాయింట్ సెక్రటరీగా విజయం సాధించారు. ఫలితాల ప్రకటనతో నూతనంగా ఎన్నికైన సెంట్రల్ ప్యానెల్ 2026-27 విద్యాసంవత్సరానికి గానూ బాధ్యతలు స్వీకరించనుంది.
హోరాహోరీ ఓట్ల లెక్కింపు..
నార్త్ క్యాంపస్‌లోని విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ స్టేడియంలో శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పలు రౌండ్లలో ఆధిక్యాలు మారుతూ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఏబీవీపీకి చెందిన యశ్ దాబాస్ తన సమీప ప్రత్యర్థి, ఎన్‌ఎస్‌యూఐ (NSUI) అభ్యర్థి విజయ్ మీనాపై విజయం సాధించి డ్యూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఇండిపెండెంట్ సంచలనం..
వైస్ ప్రెసిడెంట్ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకీన్.. ఏబీవీపీకి చెందిన ఇషాన్ మౌర్య, ఎన్‌ఎస్‌యూఐ అభ్యర్థి వీర్ చత్రత్‌లపై గెలుపొందారు. యూనివర్సిటీ పరిధిలోని 52 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 1.51 లక్షల మంది విద్యార్థులకు ఓటు హక్కు ఉండగా, మొత్తంగా 40.46 శాతం పోలింగ్ నమోదైంది.
కోర్టు ఆదేశాలతో ఆంక్షలు..
ప్రచార సమయంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు కఠిన నిబంధనలు విధిస్తూ.. ఫలితాల అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, డప్పు వాయిద్యాలు, సంబరాలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది.







